హన్మకొండ కల్చరల్: ఉభయ వేదాంత ప్రవీణకవిశాబ్ది కేసరి, మహా మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి(93) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య సీతమ్మ(88), కుమార్తెలు శేషమ్మ(70), శ్రీదేవి(63), నీలాదేవి(62), గోదాదేవి(61) మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పండితులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 1926 మే 1న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మోటూరులో జన్మించిన రఘునాథాచార్యులు, పండితులైన తన తండ్రి తాతాచార్యుల వద్ద సంస్కృత దివ్యప్రబంధ సంప్రదాయక విషయాలు అధ్యయనం చేశారు.
విద్యాభ్యాసం.. ఉద్యోగం
1942 నుంచి హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధినీ సంస్కృత విద్యాలయంలో శ్రీమాన్ శఠగోపారామానుజాచార్య స్వామి, శ్రీమాన్ వేదాంతచార్య స్వామి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1944–66 వరకు వరంగల్‌లోని వైదిక కళాశాలలో ప్రధాన అధ్యాపకులుగా, 1966–88 వరకు వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృతాంధ్ర కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత వరంగల్‌లోనే ఉంటూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీ భాష్య, భగవద్విషయ, గీతాభాష్య విషయాలను ఉపదేశిస్తూ ఎందరినో వేదాంత పండితులుగా తీర్చిదిద్దారు.
రచనలు.. పురస్కారాలు
ఆచార్యుల వారు శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం, శ్రీభాష్యము కఠోపనిషత్, ఈశావ్యాసోపనిషత్ వ్యాఖ్యా నాలు, కురంగీపంచకం తదితర యాభైకి పైగా ఉభయ వేదాంత గ్రంథాలను ప్రచురించారు. దీంతో పాటు ఉత్తరరామ చరిత్రకు శ్రీకుమార తాతాచార్య సంస్కృత వ్యాఖ్య, వేంకటాధ్వరి లక్ష్మీసహస్రమునకు శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల మునీంద్రుని అముద్రిత సంస్కృతవ్యాఖ్య, శ్రీవాధూల వీరరాఘవాచార్యస్వామి విరచిత సూక్తిసాధుత్వమాలికా, రసోదారభాణ తదితర అమూల్య గ్రంథాలను రాశారు. 1989–91వరకు కర్ణాటక మేల్కోటలోని సంస్కృత పరిశోధనా సంసత్, వారి ఉపనిషత్ ప్రణాళికకు వీరు ప్రధాన పరిశోధకులుగా పనిచేశారు. ‘కవిశాబ్దికేసరి’, ‘ఉభయవేదాంత ఆచార్య’, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గోపాలోపాయన ప్రథమ పురస్కారం, మహా మహోపాధ్యాయ, తులాభారం–కనకాభి షేకం, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందుకున్నారు. సర్వవైదిక సంస్థాన్ ‘శాస్త్రరత్నాకర ’బిరుదు, శ్రీ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి వారిచే గజారోహణ సన్మానం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొం దారు. శ్రీ శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి వారిచే బ్రహ్మరథోత్సవ సన్మానం, అ.జో–వి.భో కం దాళం ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, తెలంగాణ తొలి అవతరణ దినోత్సవం సన్మానం, మరింగంటి శ్రీరంగాచార్య స్మారక పురస్కారం, పెద్ద జీయర్‌స్వామి చేతుల మీదుగా ఉభయవేదాంత మహోదధి పురస్కారం, సర్వార్థ సంక్షేమ సమితి స్థితప్రజ్ఞ బిరుదు, శ్రీరామానుజ రామచంద్ర జీయర్‌స్వామి చేతుల మీదుగా గోపాలదేశిక పురస్కారం, కవిరత్న ఫౌండేషన్ కవిరత్న పురస్కారం పొందారు. చెన్నై యూనివర్సిటీ జీవిత సాఫల్య పురస్కారం, శలాకవిద్వత్‌సమర్చన పురస్కారం అందుకున్నారు. సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్ స్థాపించి పరిషత్, సత్సంప్రదాయ పరిరక్షణ సభను భగవత్కైంకర్యనిధి స్థాపించి శ్రీపాంచ రాత్రాగమ పాఠశాలను స్థాపించి శ్రీరామక్రతువు నిర్వహణ, పుస్తక ప్రచురణ చేశారు.
ఆలయాలకు జీర్ణోద్ధరణ: హన్మకొండలో చిన్న కోవెల, కృష్ణాజిల్లా మోటూరులో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరిపారు. శ్రీ తిరుమలాచార్య రామానుజ కూటమును నిర్మించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వీరి స్ఫూర్తి, ప్రోత్సాహం తో ఎన్నో దేవాలయాల నిర్మాణం, ప్రతిష్టలు జరిగాయి. చారిత్రక శ్రీ వేయిస్తంభాల త్రికూటాలయం లోని కేశవస్వామి గర్భగుడిలో కాకతీయుల కాలంలో ఉన్నట్లుగానే విగ్రహ ప్రతిష్టకు కృషి చేశారు.
శ్రీ రఘునాథదేశిక విశిష్ట పురస్కార ప్రదానం
తన తిరునక్షత్రోత్సవ సభల ద్వారా 13సంవత్సరాలుగా 52 మంది పండితులకు ‘శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారం ప్రదానం’చేశారు. శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి, భీమవరానికి చెందిన భాష్యకారసిద్ధాంతపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, శ్రీ శ్రీ రంగరామానుజ జీయర్‌స్వామి, శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి, శ్రీ అహోబిలం జీయర్‌స్వామి, శ్రీదేవనాథ్ జీయర్‌స్వామి వంటి ఎందరో ఆచార్యులకే ఆచార్యులుగా గౌరవం అందుకున్నారు.
కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్దిక కేసరి మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని, జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యులు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారన్నారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి అని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment