మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నాయకులు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు ఈయన స్వయన సోదరుడు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజేశ్వరరావు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిశారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్‌పల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు రాజకీయ జీవితం సీపీఐ పార్టీతో ప్రారంభమైంది.
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. 1999లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2004 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజేశ్వరరావు మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.