కడియం(తూర్పుగోదావరి జిల్లా): మాజీ నక్సలైట్, తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు తోరాటి సత్యనారాయణ (63) ఆదివారం కాకినాడలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య, వరవరరావు, గద్దర్, సత్యమూర్తి వంటి వారితో తోరాటి కలిసి పలు ప్రజాపోరాటాల్లో, నక్సల్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో ఖైదీలను విడిపించేందుకు రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలును బద్దలుగొట్టడానికి ప్రయత్నించిన సంఘటనలో తోరాటి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
1975లో మీసా కింద అరెస్టయి జైలు జీవితం గడిపారు. 1977లో నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తోరాటి కడియం పరిసరాల్లో కార్మికులకు అండగా పలు పోరాటాల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రాజకీయంగా కీలకంగా వ్యవహరించేవారు. 1989లో కాంగ్రెస్‌లో చేరారు. కడియం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 1995లో కడియం ఎంపీపీగా ఎన్నికయ్యారు. బ్రహ్మచారిగానే ఉన్న తోరాటి ఎల్లప్పుడూ నిరాడంబరంగానే జీవించారు. తోరాటి మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితర ప్రముఖులు కడియంలోని తోరాటి నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మాజీ నక్సలైట్ తోరాటి కన్నుమూత
Published Sun, May 15 2016 7:39 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement