వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు | checkings in hostels | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు

Published Thu, Jul 27 2017 1:02 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

checkings in hostels

రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు  
బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం, గోపాలపురం బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. బుట్టాయగూడెంలోని వసతి గృహంలో రికార్డులు, స్టాకు నిల్వలు, ఖర్చుల వివరాలను పరిశీలించారు. వసతి గృహంలో బిల్డింగ్‌ సక్రమంగా లేదని, స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందని ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థులు కూడా హాజరులో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రాష్ట్ర అవినీతి శాఖాధికారి ఆర్‌కే ఠాకూర్‌ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో తనిఖీలు చేశామన్నారు. అక్రమాలు అరికట్టేలా వసతి గృహాలకు సరఫరా చేసే వస్తువులపై తప్పనిసరిగా సీలు ఉండాలని ఉన్నతాధికారులకు సూచన చేశామని చెప్పారు. ఏసీబీ సీఐ జె.విల్సన్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
 
గోపాలపురం హాస్టల్‌లో అవకతవకలు
గోపాలపురం: గోపాలపురం పెద్దగూడెంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్‌లో పలు అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 117 మందికిగాను కేవలం 19 మంది మాత్రమే ఉన్నారని, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం లేదని, మెనూ పాటించడం లేదని తమ పరిశీలనలో తెలిసిందన్నారు. ఉదయం 6 గంటలకు వార్డెన్, వంట మనిషి, అటెండర్లు రావాల్సి ఉండగా ఎవరూ లేనట్టు గుర్తించామన్నారు. వీరికి బదులుగా ఒక ప్రైవేట్‌ మహిళను ఏర్పాటుచేసుకుని హాస్టల్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. 98 మంది విద్యార్థులకు అందాల్సిన ఆహారం వార్డెన్‌ స్వాహా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వార్డెన్‌ డి.నేతాజీ నుంచి వివరాలు సేకరించి రికార్డులు పరిశీలించామన్నారు. అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సీఐ కె.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎం.నాగు, ఎం.శ్రీనివాస్, పీఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement