సంపన్నుల వేడుకలే టార్గెట్..
-
బాలుడి చోరీల పరంపర
-
అరెస్టు చేసిన పోలీసులు
రాజమహేంద్రవరం క్రైం :
సంపన్నుల వివాహాలకు బంధువుగా వెళ్లడం.. సుష్టిగా భోజనం చేయడం.. అనంతరం వధూవరుల గదుల్లోకి వెళ్లి విలువైన నగలు, నగదును తస్కరించడం అతడికి కరతలామాలకం. ఆ దొంగ పదహారేళ్ల బాలుడు కావడం విశేషం. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండల డీఎస్పీ రమేష్ బాబు ఆ వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన ఒక బాలుడు 16 ఏళ్లకే ఇలా వినూత్నంగా చోరీలు చేస్తున్నాడు. సంపన్నుల వివాహాలు జరిగే కల్యాణ మండపాలను లక్ష్యంగా ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఉన్నత వర్గానికి చెందిన వాడిగా కనబడడం, ఖరీదైన దుస్తులు ధరించడంతో ఆ బాలుడిపై ఎవ్వరికీ అనుమానం కలగదు.
పుట్టినరోజు వేడుకలో చోరీ
రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఎస్‌వీ ఫంక్షన్ హాల్లో ఈనెల 6న నగరంలోని గాంధీపురానికి చెందిన గారపాటి జగన్ మోహన్ రావు తన మనుమరాలి మొదటి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ వేడుక హాజరైన బాలుడు.. పుట్టినరోజు కానుకలకు సంబంధించిన 1.50 లక్షలు విలువైన నగదు, బంగారపు ముక్కలు, చిన్న చైన్, 14 గ్రాముల బంగారు ముక్కలు, మూడు గ్రాముల చై¯Œæను చోరీ చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు.. ఎస్‌వీ ఫంక్షన్ హాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బాలుడిని సహకరించిన అతడి బంధువు కడారి నానీని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ1.50 లక్షలు విలువైన నగదు, 14 గ్రాముల బంగారం ముక్కలు, మూడు గ్రాముల చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో ప్రకాష్ నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. కాగా.. చోరీ చేసిన డబ్బులతో బాలుడు విలాస వంతమైన జీవితం గడిపేవాడు. ఖరీదైన మోటారు సైకిల్‌పై తిరిగేవాడు. ఇతర పట్టణాలకు వెళ్లి ఖరీదైన లాడ్జిల్లో దిగేవాడు.