బాల్యం .. ఓ మధురానుభూతి
రేష్మా.. ఈ రోజుల్లో ఫేం.. వెండితెర వర్ధమాన నటి. బాల్యం సింగరేణి కార్మికవాడల్లోనే గడిపింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆమె ‘సాక్షి’తో ముచ్చటింది. రేష్మ తండ్రి హరిదాస్ రాథోడ్ వృత్తి రిత్యా సింగరేణి అధికారి. ఇల్లెందు స్వగ్రామం కాగా జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. బాల్యస్మృతులు ఆమె మాటల్లోనే.. ఇల్లెందు
బాల్యం మరువలేని అనుభూతి. నా బాల్యమంతా ఇల్లెందులోనే గడిపాను. సింగరేణి బొగ్గు బావుల్లో పని చేసే కార్మికులు, బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే విధానం గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకునేదాన్ని. బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుందని అంటుంటే అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. మా నాన్న పాల్వంచలోని కేటీపీఎస్‌కు తీసుకెళ్లేవారు. తరచూ కుటుంబంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవాళ్లం.
భద్రాచలం రాములవారిని దర్శించుకోవడం, గోదావరి స్నానాలు చేయడం, పర్ణశాలను సందర్శించడం చిన్నప్పుడు భలేగా ఉండేది. పాపికొండలు, అక్కడి అడవులు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఎంతో హాయి గొలిపేది.
అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్, కిన్నెరసాని ప్రాజక్టు అందాలను తిలకించటం ఆనందంగా ఉండేది. ఇల్లెందులో మా కార్మిక వాడ గ్రామాలకు భిన్నంగా ఉండేది. అన్ని వాడలకు రోడ్లు, చెట్లు, పార్కులు, కరెంటు, ఇతర సదుపాయాలు ఉండే వి. సెలవు రోజుల్లో సరదాగా స్నేహితులతో షటిల్, క్యారం, చెస్ ఆటలు ఆడుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేశాను.