చింతమనేని చిందులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం.. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖ అధికారిపై దాడి.. ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు.. ఏలూరు టూటౌన్‌పోలీస్ స్టేషన్‌పై దాడికెళ్లినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం.. అంగన్‌వాడీ కార్యకర్తలను దుర్భాషలాడటం.. పోలీస్ కానిస్టేబుల్‌ను చితక్కొట్టడం.. అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపించడం.. ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే విషయంలో జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం వంటి ఘటనలతో బెంబేలెత్తించిన చింతమనేని.. బుధవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై విరుచుకుపడ్డారు. ఓ చానల్ విలేకరిపైనా దాడికి దిగారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. వారిపై విరుచుకుపడ్డారు. జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు కారులో వెళుతున్న చింతమనేని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నాలో తన నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండటాని చూసి ధర్నా శిబిరం వద్ద ఆగారు. ఇక్కడకి ఎందుకు వచ్చారంటూ వారిపై విరుచుకుపడ్డారు. బూతు పురాణం విప్పి ‘మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తా’నంటూ దుర్భాషలాడారు. అక్కడే ఉన్న 99 చానల్ విలేకరి, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కడవకొల్లు సాగర్ ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండటంతో చింతమనేని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు విలేకరి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని అతనిపై దౌర్జన్యానికి తెగబడి ఈడ్చుకెళ్లిపోరు. పోలీసులు ఆ విలేకరిని కాపాడి పక్కకు తీసుకువెళ్లారు. గతంలోనూ చింతమనేని మీడియా విషయంలో ఇదే విధంగా వ్యవహరించారు. తన కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీస్తున్న వారినుంచి కెమెరాలు లాక్కోవడం పరిపాటిగా మారింది. బుధవారం నాటి ఘటనతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అనంతరం చింతమనేనిపై చర్యలు కోరుతూ ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్ రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. డీఐజీ స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను ఆదేశించారు. రాస్తారోకోలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జీవీఎస్‌ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి జి.రఘురామ్, సంయుక్త కార్యదర్శి ఎస్‌కే రియాజుద్దీన్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కాగిత మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి పి.రవీంద్రనాథ్ పలువురు పాత్రికేయులు, ఫొటో జర్నలిస్ట్‌లు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు
‘అతడిని పదవికి అనర్హుడిగా ప్రకటించాలి’
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : బాధ్యతాయుతమైన ప్రభుత్వ విప్ హోదాలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళల సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి వారిపైనే చింతమనేని దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమన్నారు. మీడియా ప్రతినిధులపైనా ఆయన దాడులకు తెగబడటాన్ని చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా, నియంతృత్వ పాలన సాగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.