గదిలో నిర్బంధించి.. చంపేస్తానని బెదిరించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్
అక్రమ మట్టి తవ్వకాలపై వార్త రాసినందుకు తీవ్ర హెచ్చరికలు
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల సాక్షి విలేకరి, యలమంచిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బుదిరెడ్డి అప్పారావుపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దాడికి పాల్పడ్డారు. శనివారం దిమిలి గ్రామంలో తన నివాసంలో అప్పారావు తనపై దాడి ఘటనను మీడియాకు వివరించారు. ‘ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నా మొబైల్‌కు ఫోన్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత ఆయన పీఏ చంద్రారావుతో ఫోన్ చేయించారు.
అయినప్పటికీ నేను ఫోన్ తీయలేదు. మళ్లీ 20 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి మీతో మాట్లాడాలని, అచ్యుతాపురంలోని ఎస్టీబీఎల్ లేఅవుట్‌లో ఉన్న తన స్వగృహానికి రావాలని చెప్పారు. దానికి నేను రానని చెప్పాను. అయితే వెంటనే పంపించేస్తానని.. రాంబిల్లి మండలం కొత్తూరు వరకు కారు పంపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అయినప్పటికీ నేను రానంటే రావాలని ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితిల్లో నా స్వగ్రామం దిమిలి నుంచి బైక్‌పై కొత్తూరుకు వెళ్లాను. అప్పటికే అక్కడ బ్లాక్ స్కార్పియోతో ఎమ్మెల్యే డ్రైవర్ జగదీష్ ఉన్నాడు.
నన్ను కారు ఎక్కించుకుని ఎస్టీబీఎల్‌లో అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు ఇంటి ముందు దించారు. అక్కడ 40 నిమిషాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కోసం ఎదురుచూశాను. అప్పటికి కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేను వెళ్లిపోతానని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి చెప్పాను. దానికి పీఏ తన రూమ్ పక్కనే ఉందని, అక్కడకు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగా గదిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఉన్నారు. తాను లోపలకు వెళ్లగానే రూమ్ డోర్ మూసేశారు’ అని అప్పారావు వివరించారు.
చంపేస్తానని హెచ్చరించారు..
‘నన్ను గదిలో బంధించి ‘యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు’ పేరిట సాక్షిలో ఎందుకు వార్త రాశావు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఎన్నికలకు ముందు సాక్షిలో ప్రచురించిన కథనాలపై నిలదీశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చాక ఎన్నికల్లో ఓడించడానికి కథనాలు రాశావంటూ మండిపడ్డారు.
ఆ కథనాలు నేను రాయలేదని, విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్లు రాశారని సమాధానమిచ్చినా ఆయన వినిపించుకోలేదు. వారం క్రితం ‘యథేచ్ఛగా మట్టి దందా’ పేరుతో ఎందుకు వార్త రాశావని బెదిరించారు. దానికి నేను సమాధానంగా అక్రమంగా మట్టి దందా చేస్తే ఖచ్చితంగా రాస్తానని.. ఇదే వార్త సాక్షితో పాటు ఈనాడులో కూడా వచ్చిందని చెప్పాను. దీంతో వెంటనే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నిన్ను చంపేస్తాను’ అని హెచ్చరించారు.
నా తల్లిని తిట్టడంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ కోపంతో మెడ పట్టుకుని చంపేస్తా అని బెదిరించారు. ఆ క్షణంలో నాకు ప్రాణహాని ఉందని గ్రహించి అక్కడ నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డాను. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నా’ అని అప్పారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment