చిర్రావూరికి సత్కారం... పాండిత్యానికి పట్టం
-
వేద విభూషణ బిరుదను సార్ధకం చేసుకున్న చిర్రావూరి
-
చిర్రావూరికి సింహతలాట ద్వయ సమర్పణ సభలో వక్తలు
-
ఒకే వేదికపై ముగ్గురు మహామహోపాధ్యాయులు
రాజమహేంద్రవరం కల్చరల్ :
ఇది పాండిత్యానికి పట్టం, విద్వల్లోకానికి అభినందన సత్కారమని మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ చిర్రావూరికి జరిగిన సింహతలాటద్వయ సమర్పణ సభను అభివర్ణించారు. ఇటీవల శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్ చిర్రావూరి శ్రీరామ శర్మ మహా మహోపాధ్యాయ బిరుదును అందుకున్న సందర్భంలో మంగళవారం ప్రకాష్ నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆయన అభిమానులు, శిషు్యలు నిర్వహించిన సత్కార సభకు విశ్వనాథ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ మాట్లాడుతూ పుష్యమాసంలో విద్వత్ సమ్మానం, దేవతా పూజలు చేస్తే, శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. వేదభాస్య విభూషణ బిరుదాన్ని సార్థకం చేసుకున్న వ్యక్తి చిర్రావూరి అని, దేశంలో పూర్వ మీమాంసా శాస్త్రంలో వేళ్ళపై లెక్కపెట్టగల వ్యక్తుల్లో ఆయన ఒకరని , అలవోకగా సంస్కృతాంధ్రాల్లో అవధానాలు చేశారు, ఏ శాస్త్రమైనా మనకు ఎందుకు లొంగదు అన్న పట్టుదల ఆయనలో కనపడుతుందని ప్రశంసించారు. వేదం కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమేకాదు, లౌకిక ప్రయోజనాలకు కూడా వేదం ఉపయోగిస్తుంది, వేదాన్ని సైన్సుగా నిరూపిస్తున్న చిర్రావూరి కృషిని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సైతం అభినందించారని గుర్తు చేశారు. ‘స్వాద్ధా్యయ భాస్కర’ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మాట్లాడుతూ వేదపండితుని సత్కరిస్తే, అన్ని విద్యలను సత్కరించినట్టేనని అన్నారు. మరో మహా మహోపాధ్యాయ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ ఫలవంతం కాని ప్రయత్నం ఉండదని, చిర్రావూరి జీవితమే ఇందుకు నిదర్శనమన్నారు. భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ ‘మీ దేశంలో విద్వాంసుల మధ్య విభేదాలు ఎందుకు ఉంటా’యని ఒక అమెరికా మిత్రుడు నన్ను ప్రశ్నించగా విభేదాలు, స్పర్థలు విద్యల వరకు మాత్రమేనని జవాబు ఇచ్చానని అన్నారు. ఒకప్పుడు కాశీక్షేత్రం పండితులకు ప్రధాన కేంద్రం, రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రమవుతుందని దివంగత సద్గురు కందుకూరి శివానందమూర్తి అనేవారని, ఆ మాటలు నిజమయ్యే రోజులు వచ్చాయన్నారు. నగర ప్రముఖుడు దాట్ల బుచ్చి వేంకటపతి రాజు జ్యోతి ప్రజ్వలనం చేశారు. తిరుపతి నుంచి వచ్చిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత కొంపెల్ల రామసూర్యనారాయణ చిర్రావూరి పాండితీగరిమను ప్రశంసించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిర్రావూరికి సింహతలాటద్వయ సమర్పణ చేశారు. ముందుగా వేదిక వద్దకు చిర్రావూరిని పూర్ణకుంభంతో, వేదస్వస్తితో తీసుకువచ్చారు. చిర్రావూరి తనకు జరిగిన సత్కారానికి ఉచితరీతిన కృతజ్ఞతలు తెలిపారు. వేద శాస్రా్తలపై మరిన్ని పరిశోధనలు జరగాలని, ఇందుకు ఒక సంస్థను నెలకొల్పాలని కోరారు. వేదశాస్రా్తభిమానులు, సాహితీవేత్తలు తరలి వచ్చారు.