
చిత్తూరు మేయర్ దారుణ హత్య
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆయనను రాయవెల్లూరులోని సీఎంసీకి తరలించారు.
దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 8 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. దుండగులంతా 25-35 ఏళ్ల మధ్య వయసువాళ్లేనని ప్రత్యక్ష సాక్షి లోకనాథం 'సాక్షి'కి తెలిపారు. తర్వాత అందరూ ద్విచక్ర వాహనాలపై పారిపోయారని, అలా వెళ్లేటప్పుడు మూడు బురఖాలు, ఒక రివాల్వర్ కింద పడిపోయాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో కఠారి మోహన్ ప్రధాన నిందితుడు. గతంలో ఆయన కర్ణాటకలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తన భార్యను మేయర్‌గా చేసుకున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూపు వ్యతిరేకించింది. అయితే తాను చాలాకాలం పార్టీ కోసం కష్టపడ్డానని, భద్రతా కారణాల రీత్యా కూడా ఆ పదవి కావాలని పట్టుబట్టి మరీ భార్యను మేయర్ చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి పార్టీలోని ఒక గ్రూపు మాత్రం మోహన్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. మేయర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కుటుంబ కలహాలు కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు.