తుని ఘటనపై సీఐడీ విచారణ వేగవంతం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనపై సీఐడీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం విశాఖపట్నం నుంచి వచ్చిన సీఐడీ ప్రత్యేక బృందం జిల్లాలోని పిఠాపురం పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం సేకరిస్తోంది. తుని ఘటన రోజు కాపు ఐక్య గర్జన సభకు వచ్చిన వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విచారణను మాత్రం పోలీసులు గోప్యంగా నిర్వహిస్తున్నారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆ సామాజిక వర్గం నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది జనవరి 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని వి.కొత్తూరు వద్ద కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
దీంతో స్థానిక రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అయితే అంతకుముందు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో రైలు ఇంజన్ ధ్వంసమైంది. అలాగే తుని పట్టణంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుంది.