‘తుని విధ్వంసానికి చంద్రబాబే కారణం’
విశాఖ : కేసుల పేరుతో ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికుట్రలు చేసినా తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుని విధ్వంసానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. దమ్ముంటే వాయిదాలు లేకుండా తుని విధ్వంసం కేసును విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, తమ జాతి కోసం పోరాడుతానని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల కోసం అవసరం అయితే ప్రాణాలు అర్పిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.
తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ డిమాండ్‌లో న్యాయం ఉందని, నెరవేర్చతగ్గదే అని అన్నారు. తన నేర చరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాల్ విసిరారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్ర తలపెట్టారు. అయితే యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది. పాదయాత్రకు అనుమితి ఇచ్చినా లేకున్నా, తమ యాత్ర కొనసాగుతుందని ముద్రగడ వెల్లడించారు.
కాగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన విధ్వంసానికి దారితీసింది. సభకు వచ్చిన వేలాది మంది తునిలో రైల్‌రోకో, రాస్తారొకోలు నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, పోలీస్ వాహనాలు దగ్ధం వంటి తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి.