కీసరగుట్ట వద్ద నగర యువకుల హల్ చల్
- సర్పంచ్, ఎంపీటీసీలపై దాడి, పరారీ
కీసర: రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన యువకుల బృందం కీసర గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మరో ఇద్దరిపై దాడిచేసిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే
హౌదరాబాద్ నగరంలోని లాలాపేటకు చెందిన కొందరు యువకులు బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆదివారం సాయంత్రం కీసరగుట్ట వెళ్లారు. అదేసమయంలో కీరస సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ రమేష్ గుప్తాలతోపాటు, మరో ముగ్గురు గ్రామస్తులు కూడా పనిమీద వెళ్లొస్తున్నారు. జెడ్పీగెస్ట్ హౌస్ వద్ద అనుకోకుండా ఇరువర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో 20 మందివరకున్న యువకులు.. సర్పంచ్, ఎంపీటీసీ, మరో ముగ్గురిని చితకబాదారు.
ఎంపీటీసీ రమేష్ గుప్తా అక్కడి నుంచి తప్పించుకొని కీసర గ్రామానికి వెళ్లి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో గ్రాస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి పరుగుతీశారు. దాడిచేసిన యువకుల్లో ఇద్దరు మాత్రమే చిక్కగా మిగతావారు పరారయ్యారు. దొరికిన ఇద్దరికి దేహశుద్ధిచేసిన పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ గణేష్, వెంకట్‌ను ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.