ఆధిపత్య పోరే ప్రాణం తీసింది | Clashes between two RTC unions claims life of a worker | Sakshi
Sakshi News home page

ఆధిపత్య పోరే ప్రాణం తీసింది

Published Mon, Jul 11 2016 9:33 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

Clashes between two RTC unions claims life of a worker

ప్రొద్దుటూరు‌: ఒక యూనియన్‌పై మరో యూనియన్‌ ఆధిపత్యం చేయాలనే ఒకే ఒక కారణం.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం సకాలంలో స్పందించక పోవడం.. పోలీసుల వ్యవహారం కూడా ఇందుకు పరోక్షంగా కారణమయ్యాయని కార్మికులు మండిపడుతున్నారు. యూనియన్లు ఉండేది కార్మికుల సంక్షేమం, వారికి న్యాయం చేసేందుకే తప్ప ఆధిపత్యం చూపించుకోవడానికి కాదని వారు అంటున్నారు. చిన్న సంఘటన జరిగినప్పుడే డిపో అధికారులు స్పందించి.. కఠినంగా హెచ్చరించి ఉంటే ఈ వ్యవహారం ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చేది కాదు. ఏ సంఘటన జరిగినా సస్పెండ్‌ చేస్తామన్న ఉన్నతాధికారుల మాటలు తప్ప.. ఏం జరిగిందో విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోలేక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తననే కొట్టి.. తన పైనే కేసు పెట్టడంతో మనస్తాపం
ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో శ్రామిక్‌ కొండారెడ్డి శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కొండారెడ్డి, మెకానిక్‌ రామచంద్రుడు మధ్య మాటకుమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కొండారెడ్డిని రామచంద్రుడు చెప్పుతో కొట్టగా... కొండారెడ్డి రామచండ్రుడి పైకి టైర్‌ రింగ్‌ విసిరాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి స్వల్ప గాయమైంది. కొండారెడ్డి దాడి చేశాడంటూ రామచంద్రుడు పోలీస్‌స్టేçÙన్‌లో కేసు పెట్టారు. తనను చెప్పుతో కొట్టాడని కొండారెడ్డి పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అక్కడి ఎస్‌ఐ పట్టించుకోలేదు. అసలు ఈ విషయం పోలీస్‌స్టేçÙన్‌ వరకు వెళ్లడాన్ని ఆర్టీసీ అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి.

షెడ్‌లో 40 మందికి పైగా కార్మికులు
గొడవ జరిగిన సమయంలో గ్యారేజిలో 40 మందికిపై కార్మికులు విధుల్లో ఉన్నారు. అయితే జరిగిన వాస్తవాన్ని అక్కడ ఉన్న కార్మికులు ఎవరూ పోలీసులకు చెప్పలేదు. పైగా కొండారెడ్డే దాడి చేశాడని రామచంద్రుడికి ఒత్తాసుగా కొందరు కార్మికులు పోలీసులకు చెప్పారు. దీంతో కొండారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను కొట్టి, మళ్లీ తనపై కేసు పెట్టడంలో ఒక యూనియన్‌ నాయకులు వ్యవహరించిన తీరు... తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తిరష్కరించిన విషయం కొండారెడ్డి ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. ఆయన గ్యారేజి ఆవరణలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకున్న సంఘటనను ఎవరూ చూడ లేదని అధికారులు చెబుతున్నారు. 40 మందికి పైగా పని చేసే బహిరంగ ప్రదేశంలో ఎవరూ చూడకుండా ఎందుకు ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యంతోపాటు యూనియన్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement