ముగిసిన సమరం | closed to greater fight | Sakshi
Sakshi News home page

ముగిసిన సమరం

Published Wed, Feb 3 2016 2:44 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ముగిసిన సమరం - Sakshi

ముగిసిన సమరం

ప్రశాంతంగా ‘గ్రేటర్’ ఎన్నికలు
♦  జిల్లా పరిధిలోని 63
♦  జీహెచ్‌ఎంసీ వార్డులకు ఓటింగ్ పూర్తి
♦  ఈనెల 5న ఓట్ల లెక్కింపు
♦  ఫలితాలపై పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్ మహానగర పాలక సంస్థ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీలోని 63 డివిజన్లున్నాయి. ఈ డివిజన్లలో పోలింగ్ పక్రియ పకడ్బందీగా సాగేందుకు 16వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఉదయం 7గంటలకు   ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలవరకు సాగింది. సమయం ముగిసేలోపు పోలింగ్ స్టేషన్లో ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ డివిజన్లలో మొత్తంగా 45శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
 
 కీలక సీట్లలో గెలుపు కోసం..
 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 150 డివిజన్లుండగా.. ఇందులో 63 డివిజన్లు జిల్లాలోనే ఉన్నాయి. 42 శాతం జిల్లా ఓటర్లే కావడంతో మేయర్ పీఠాన్ని జిల్లా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు. నగరంలో మజ్లిస్ సిట్టింగ్ సీట్లు మినహాయిస్తే మేయర్ గెలుపునకు జిల్లా సీట్లే కీలకం. దీంతో అన్నిపార్టీలు జిల్లా డివిజన్లపైనే గంపెడాశలు పెట్టుకుని పోరుకు దిగాయి. ఈ క్రమంలో అన్నిరకాల అస్త్ర, శస్త్రాలను ప్రయోగించిన అభ్యర్థులు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేశారు.
 
 మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
 
 5న ఫలితాలు..
 పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈనెల 5న ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించనుంది. ఇప్పటివరకు గెలుపుకోసం కృషి చేసిన అభ్యర్థులు.. ఇక ఓటింగ్ సరళిని విశ్లేషించుకుని గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంకోసం నగరానికి తరలిన జిల్లా రాజకీయ నేతలు, కార్యకర్తలు సొంత ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు. శివారు ప్రాంతాల్లో స్థానిక నేతలకే ప్రచార బాధ్యతల్ని అప్పగించడంతో జిల్లాకు చెందిన నేతలంతా పక్షం రోజులపాటు నగరంలో తిష్టవేశారు. తాజాగా ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో తిరుగుపయనమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement