నేటితో క్లస్టర్ విధానం రద్దు
వైద్య ఆరోగ్యశాఖలో ఐదున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన క్లస్టర్ విధానం బుధవారంతో రద్దవుతోంది. డెప్యూటీ డీఎంహెచ్‌వోలు ఇక వైద్యశాలలో డాక్టర్లుగా సేవలు అందించనున్నారు.
వైద్యశాల విధుల్లోకి డెప్యూటీ డీఎంహెచ్‌వోలు
జిల్లాలో 14 క్లస్టర్లు, 81 పీహెచ్‌సీలు
అవనిగడ్డ :
వైద్య ఆరోగ్యశాఖలో ఐదున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన క్లస్టర్ విధానం బుధవారంతో రద్దవుతోంది. డెప్యూటీ డీఎంహెచ్‌వోలు ఇక వైద్యశాలలో డాక్టర్లుగా సేవలు అందించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించేందుకు నియామక పత్రాలను మంగళవారం అందుకున్నారు.
2011లో క్లస్టర్ విధానం ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు, పీహెచ్‌సీలను డీఎంహెచ్‌వో ఒక్కరే పర్యవేక్షించలేకపోవడంతో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలను వేగవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో 2011 ఫిబ్రవరిలో క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా 14 క్లస్టర్లను ఏర్పాటు చేయగా వీటి పరిధిలో 81 పీహెచ్‌సీలున్నాయి. వీటిలో 14 మంది డాక్టర్లు డెప్యూటీ డీఎంహెచ్‌వోలుగా పనిచేస్తుండగా 98 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వైద్యశాలలు, పీహెచ్‌సీలను పర్యవేక్షించడం వైద్య, ఆరోగ్యశాఖలో కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు చేసేందుకు ప్రత్యేక సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు వీరు నిర్వహించేవారు. కొన్ని వైద్యశాలల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డెప్యూటీ డీఎంహెచ్‌వోలు రోగులకు వైద్యసేవలు అందించకుండా ఖాళీగా ఉంటున్నారనే ఉద్దేశ్యంతో పూనం మాలకొండయ్య క్లస్టర్ విధానాన్ని రద్దుచేశారు. బుధవారం నుంచి వీరు గతంలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి నియామక పత్రాలను మంగళవారం అందుకున్నారు. బుధవారం నుంచి వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించనున్నారు.