సాగునీటి విడుదలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ !
Published Sun, Aug 21 2016 7:30 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ : జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు నాగార్జునసాగర్ నుంచి ఒక పంటకు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం కే సీఆర్‌ను కలసి జిల్లా పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే అధికారులు, సాగునీటి పారుదల మంత్రితో మాట్లాడి సాగర్ నుంచి ఒక పంటకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారని ఎంపీ తెలిపారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు సమావేశమై నీటి విడుదలపై నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపడంతోపాటు, వెంటనే స్లూయిస్‌ను పెంచేందుక సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. వాస్తవానికి జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది కానీ పుష్కరాల బిజీలో ఉన్నందున సమావేశం నిర్వహించడం సాధ్యపడలేదని ఎంపీ చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, దుబ్బాక నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Advertisement