నీటి భద్రత బాధ్యత మీదే
నీటి భద్రత బాధ్యత మీదే
Published Tue, Aug 8 2017 12:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM
యువ ఇంజినీర్లతో చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం :
రాబోయే కాలంలో ప్రజలకు నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువ ఇంజినీర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. వర్షం కారణంగా స్పిల్‌వే పనులను మాత్రమే పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారంతో పోలిస్తే ఈ వారం స్పిల్ వే పనుల్లో వేగం తగ్గిందని, దాన్ని పెంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ పునరావాసంపై దృష్టి పెట్టి 2018 మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జలవనరుల శాఖలో కొత్తగా నియామకాలను జరిగిన 518 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు 2050 వరకూ విధుల్లో ఉంటారని, 2022కి దేశంలో మూడు అగ్ర రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉండాలని, అదే విధంగా 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు విజన్ సిద్ధం చేశామని దానికి సహకరించాలని కోరారు. 2050 నాటికి దేశంలో అత్యున్నత రాష్ట్రంగా ఉండాలన్నారు. రెండు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. ఒక నెల క్లాసులు, మరో నెల ఫీల్డ్‌లోను ఈ శిక్షణ ఉంటుందన్నారు. రాష్టంలో 28 ప్రాజెక్టులను ఈ యేడాది పూర్తి చేస్తామన్నారు. యువ ఇంజినీర్లలో 190 మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు. నీరు ఉంటే సంపద సృష్టించుకోవచ్చన్నారు. పర్యావరణ సమతుల్యత లేకపోవటం వల్ల నీటి వనరులు తగ్గిపోతున్నాయన్నారు. పోలవరం వంటి మేజర్ ప్రాజెక్టును మళ్లీ చూడబోమన్నారు. ఇప్పటి వరకు 18సార్లు పోలవరం వచ్చానని, 34సార్లు వర్చువల్ తనిఖీ చేశానని అన్నారు. భూగర్భ జలాలను రెండు మీటర్లు పెంచగలిగితే దాదాపు 180 టీఎంసీల నీరు సమకూరుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకోవచ్చని, 350 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులు పూర్తి అయితే నీటికి భరోసా, భద్రత వస్తుందన్నారు.నీటిని పొదుపుగా వాడాలని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. నీరుచెట్టు, నీరు ప్రగతి పథకాలను తీసుకు వచ్చామన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం అథారిటీ కమిటీ సభ్యుడు ఆర్‌కె.గుప్తా ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎçస్ జవహర్, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివరామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, ఎస్‌పీ ఎం.రవిప్రకాష్, ప్రాజెక్టు ఎస్‌ఈ విఎస్.రమేష్‌బాబు పాల్గొన్నారు.
Advertisement