'తలసాని స్థాయిని తగ్గించలేదు.. పెంచాం'
వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ఇటీవల ఆయనను ఆ శాఖ నుంచి మార్చడం, అంతగా ప్రాధాన్యంలేని శాఖలు కేటాయించడంపై అన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముక్తాయింపునిచ్చే ప్రయత్నం చేశారు. తలసాని స్థాయిని తగ్గించలేదని, పెంచామని అన్నారు.
బుధవారం ఖమ్మంలో జరుగుతోన్న టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తలసాని శాఖ మార్పులపై వివరణ ఇచ్చారు. 'శాఖల్లో మార్పుతో తలసాని స్థాయిని తగ్గించలేదు. పెంచాం. ఆయనతో అన్నీ చర్చించాకే మార్పులను ఖరారు చేశాం. అయినా తలసాని ప్రజా నాయకుడు. ఆయనకు పదవులతో సంబంధంలేదు' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల కిందట జరిగిన శాఖల మార్పుల్లో ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావుల శాఖల్లోనూ మార్పులు చేశారు. కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు దక్కగా, జూపల్లికి పంచాయతీరాజ్ శాఖను కట్టబెట్టారు. పంచాయితీ రాజ్ లో అంతర్భాగంగా ఉండి, ఇప్పుడు ప్రత్యేక శాఖగా మార్చిన గ్రామీణ నీటి సరఫరా శాఖను కూడా సీఎం తనవద్దే ఉంచుకున్నారు. హరీశ్ నిర్వహిస్తోన్న గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించారు.
(చదవండి: కేటీఆర్కు ప్రమోషన్... తలసానికి డిమోషన్..)