పట్టు వస్త్రాలు తీసుకువెళుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి,తిరుమల:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.40 గంటలకు సీఎం సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు సీఎంకు పట్టువస్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం పచ్చకర్పూరపు వెలుగులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూప విశేషాలు, క్షేత్ర సంప్రదాయాలు అర్చకులు సీఎంకు వివరించారు. తర్వాత రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావుæ, జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. తర్వాత సీఎం చంద్రబాబు పెద్ద శేషవాహన సేవలోని మలయప్పస్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు మాణిక్యాలరావు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, నారాయణ పాల్గొన్నారు.