కోడ్ ఉల్లంఘన
కోడ్ ఉల్లంఘన
Published Mon, Feb 6 2017 10:19 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తీరు వివాదాస్పదం
- రాత్రి వేళ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ
- మున్సిపల్ కార్యాలయమే వేదిక
కొత్త పింఛన్ల పంపిణీలో అధికార పార్టీ రాజకీయం మొదటికే మోసం తీసుకొచ్చింది. మంజూరయిన వారం రోజుల కానీ తెరుకోకపోవడం.. తీరా కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిసి రాత్రి వేళ హడావుడి చేయడం లబ్ధిదారులను కూడా ఆందోళనకు గురి చేసింది. ఎమ్మెల్యే వచ్చేంత వరకు పంపిణీని వాయిదా వేయడం.. తీరా ఆయన వచ్చాక కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసి సోమవారం రాత్రి గట్టుగా పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన తీరు వివాదాస్పదమవుతోంది. పనిలో పనిగా కొందరు తమ్ముళ్లు పింఛన్లకు డబ్బు వసూలు చేయడం గమనార్హం.
ఎమ్మిగనూరు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం నోటిఫికేషన్(ఈసీఐ/పీఎన్/14/2017) జారీ చేసింది. బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29న పూర్తవుతుండటంతో ఈ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నుండే కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి సామాజిక పింఛన్ల పంపిణీని చేపట్టారు. మండల కేంద్రమైన నందవరంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికారికంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఎన్నికల కోడ్ వచ్చిందని తెలుసుకున్నారో.. లేక పది రోజుల తర్వాత ఎమ్మిగనూరుకు మొదటి సారి వచ్చిన సందర్భమో కానీ.. సోమవారం రాత్రి ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల హడావుడి మొదలైంది. విషయమేమని తెలుసుకుంటే.. సామాజిక పింఛన్ల లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలతో చైర్‌పర్సన్ చాంబర్‌లో సమావేశమయ్యారు. పింఛన్లు, రేషన్‌కార్డులను వెంటనే పంపిణీ చేయాలని సూచించారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలోనే మెప్మా పీఓ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది రాత్రి 9 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలోనే పింఛన్లను పంపిణీ చేశారు. అక్కడే ఉన్న తెలుగు తమ్ముళ్లు లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేయడం గమనార్హం. ఈ విషయమై ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిని ప్రశ్నించగా ఎన్నికల కోడ్ వచ్చినట్లు తెలియదని, అయినా ఏమవుతుందిలే అంటూ సమాధానం ఇచ్చారు.
Advertisement
Advertisement