
ఉమా... నాని మధ్య వార్
నిర్మాణంలో ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ వ్యవహారంపై అధికార పార్టీలో రోజుకో అలజడి రేగుతోంది.
ప్రతిష్ట కోసం పాకులాట
మంత్రి ఉమా వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ విభేదాలు
తెరపైకి మంత్రి శిద్దా రాఘవరావు, కార్యదర్శి శ్యాంబాబు
విజయవాడ : నిర్మాణంలో ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ వ్యవహారంపై అధికార పార్టీలో రోజుకో అలజడి రేగుతోంది. ఫ్లైఓవర్‌ను సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు నేతల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య వివాదం రగులుతుండగా, తాజాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎంపీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమైంది.
ఆ ఘనత మంత్రి శిద్దాదేనట!
దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని గత ఎన్నికల ముందు బుద్దా వెంకన్న కుమ్మరపాలెం సెంటర్‌లో ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు ప్లాన్లు తయారు చేయించి, అందులో ఒక దానిని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింప చేసి కేంద్రం వాటాగా రూ.280 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారు.
ఇదే విషయం శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ తన కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగారని ఆయన వెల్లడించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాత్రం ఇటీవల విజయవాడలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మాట్లాడుతూ ఫ్లైఓవర్‌ను తానో, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నో సాధించామని అందరూ అనుకుంటున్నారని, వాస్తవానికి మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుల కృషితోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని బహిరంగంగా ప్రకటించారు.
శిద్దా, శ్యాంబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదికలు ఇవ్వడం వల్లే ఫ్లైఓవర్ మంజూరైందని, వారినే అభినందించాలంటూ అధికారులకు కూడా సూచించారు. దీంతో అక్కడ ఉన్న అధికారులు, తెలుగుదేశం నేతలు అవాక్కైనట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకపక్క ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఫ్లైఓవర్ విషయంలో వివాదం కొనసాగుతుండగానే మంత్రి ఉమా తన వ్యాఖ్యల ద్వారా మరో వివాదానికి తెరతీసినట్లయింది.
ఉద్దేశపూర్వకంగానే...
మంత్రి ఉమా వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే కనబడుతున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు. ఎంపీ కేశినేని నాని, మంత్రి ఉమా మధ్య గతంలోనూ వివాదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఫ్లైఓవర్ ఘనత నానికి దక్కకూడదనే ఉద్దేశంతోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్మాణం నత్తనడకనే...
ఒకపక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. మరోపక్క పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. అయినా ఆ విషయాన్ని పట్టించుకోని నేతలు వివాదాలపై దృష్టి కేంద్రీకరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ పనుల్లో జాప్యం ఇలాగే కొనసాగితే కచ్చితంగా పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ కచ్చితంగా పూర్తికాదు. అప్పుడు వచ్చే అప్రదిష్టకు ఎవరు బాధ్యత వహిస్తారనేది నేతలు తెచ్చుకోవాలి మరి.