మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా?
-
మనుబోలు పీహెచ్‌సీ వైద్యురాలిపై కలెక్టర్ ఆగ్రహం
మనుబోలు: మనుబోలు పీహెచ్‌సీలో బెడ్‌లు, కాన్పుల గది అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్ ముత్యాలరాజు వైద్యాధికారిణి సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారని ప్రశ్నించారు. మనుబోలు పీహెచ్‌సీ, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల పర్యవేక్షణకు అడిషనల్ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలను నోడల్ అధికారులుగా నియమిస్తామన్నారు. రెండు నెలలలో పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాతా శిశు మరణాలను అరికట్టేందుకు కృషి చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. ప్రతి నెలా 9న ఆస్పత్రిలో మదర్స్‌డే నిర్వహించాలని తెలిపారు. పేద మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలన్నారు.
పాఠశాల పరిశీలన
కేఆర్‌పురంలోని సీఎంనగర్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని వంట మనిషి ఇంటి నుంచి తీసుకువస్తున్నట్లు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల వద్దే వంట చేయాలన్నారు. 5వ తరగతి విద్యార్థికి ప్రశ్నలు సంధించి చెప్పలేకపోవడంతో విద్యా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మందులను చెత్తలో పడవేయడంపై అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. ఆమె సమాధానం చెప్పకుండా ఏఎన్‌ఎంలపై చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయన వెంట ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓ శారద, ఏటీసీ సాల్మన్‌రాజు, డీఎంహెచ్‌ఓ వరసుందరం ఉన్నారు.