ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేయండి
-
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి విజయవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగళాలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో పక్షుల పండగ నిర్వహించనున్నామన్నారు. ఫెస్టివల్ ప్రచారం కోసం హోర్డింగులు, వాల్‌పోస్టర్లు, ఫేస్‌బుక్‌ను వినియోగించాలన్నారు. పండగకు ఏర్పాట్లకు సంబంధించి అధికారులతోపాటు, అనధికారులకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బీవీపాళెంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తెరచాప పడవలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
అందుబాటులో గజ ఈతగాళ్లు
బోటు షికారు ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో నిర్వహించిన పండగల్లో ధరలను పరిశీలించి వాటి ఆధారంగా పక్షుల పండగకు రేట్లు నిర్ణయించాలన్నారు. ఫుడుకోర్టులు ఏర్పాటు చేసి నాణ్యమైన రుచికరమైన వాటిని సరసమైన ధరలకు అందించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా క్యాటిల్‌షో, డాగ్‌షో, స్నేక్ షోలను ఏర్పాటు చేయాలన్నారు. సూళ్లూరుపేట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ పక్షుల పండగ ఘనంగా నిర్వహించేలా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు. ఆటలపోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. జేసీ–2 రాజ్‌కుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ముందుగా స్థానిక కళాకారులకు అవకాశం కల్పించిన అనంతరం మెగాషోలు ప్రారంభమవుతాయన్నారు. పర్యాటక శాఖాధికారి నాగభూషణం మాట్లాడుతూ పండగకు సంబంధించి 2కె, 5కె రన్‌తోపాటు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పక్షుల పండగకు సంబంధించిన పాటపాడిన జేసీ–2 కారు డ్రైవర్ కృపానందాన్ని కలెక్టర్, జేసీ అభినం«దించారు. సమావేశంలో జేడ్పీ సీఈఓ రామిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.