సామాన్యులకు పెద్ద కష్టాలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం )
పెద్దనోట్ల రద్దు సామాన్యుల పాలిట శిక్షగా మారింది. వాటిని రద్దు చేసిన కేంద్రం, ఆర్‌బీఐ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాతపెద్దనోట్లు చెల్లకపోవడం, చిల్లర లేకపోవడంతో సామాన్యుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఉద్యోగులు, కూలీలు, గృహిణులు మొత్తం అన్ని పనులు వదిలేసి బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొంటున్నారు. అయినా సమస్య తీరడం లేదు. నిత్యావసరాలు, మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిగా చేతులెత్తేసిన బ్యాంకర్లు
కరెన్సీ మార్పిడి విషయంలో బ్యాంకర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ నెల ఎనిమిదిన నోట్లరద్దుపై ప్రకటన చేసిన కేంద్రం.. 11 నుంచి ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని ప్రకటించింది. అయితే.. జిల్లా వ్యాప్తంగా కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. దాదాపు 80శాతం ఏటీఎంల ముందు ’అవుట్ ఆఫ్ సర్వీసు’ అని బోర్డు కన్పిస్తోంది. రూ.వందనోట్లు పెట్టి, ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకున్నా సామాన్యులకు కాస్త ఇబ్బందులు తప్పేవి. మరో 2–3 వారాలు ఏటీఎంలలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎస్‌బీఐ, ఆంధ్రా, సిండికేట్‌తో పాటు పది బ్యాంకుల్లోనే నగదు మార్పిడి చేస్తున్నారు. తక్కిన 14 బ్యాంకుల్లో నగదు రాలేదని చెబుతున్నారు. అనివార్యంగా అన్నివర్గాల వారు నగదు కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. తీరా బ్యాంకర్లు రెండు రూ.2 వేల నోట్లు చేతిలో పెడుతున్నారు. రూ.500 నోట్లు ఇంకా బ్యాంకులకు చేరలేదు. మరోవైపు రూ.2వేల నోట్లను దుకాణదారులు ఎక్కడా తీసుకోవం లేదు. రూ.2 వేలకు సరుకు కొనుగోలు చేస్తే సరి. లేదంటే చిల్లర లేదని నిరాకరిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది కరెన్సీని అపార్ట్‌మెంట్లు, వీధుల్లోకి తీసుకెళ్లి ’మొబైల్ ఏటీఎం’ తరహాలో పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ’అనంత’లోనూ అన్ని బ్యాంకులు చేపడితే ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.
సామాన్యుల వేదన
ఆరురోజులుగా సామాన్యులు చిల్లర కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. దాదాపు అన్ని ఇళ్లలో వందనోట్లు స్వల్పంగా ఉంటే, రూ.500 నోట్లు అధికంగా ఉన్నాయి. వీటిని మార్పిడి చేసుకోలేని వాళ్లు కిరాణా కోట్లకు వెళితే.. అక్కడా తీసుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. అనారోగ్యం కారణంగా రోజూ మందులు వేసుకోవాల్సిన వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వీరు రద్దయిన పెద్దనోట్లతో మందుల దుకాణాలకు వెళితే, వాటిని తీసుకోవడం లేదు. ఆదివారం చికెన్, మట¯ŒS కొనుగోలుకూ కరెన్సీ కష్టాలు ఎదురయ్యాయి. కిలో మటన్ రూ.450 ఉంటే, కొందరు రూ.500 చొప్పున విక్రయించారు. చివరకు మందుబాబులకూ నోట్ల సెగ తాకింది. మద్యం దుకాణాల వల్ల పాతనోట్లు చెల్లవు అని బోర్డులు పెట్టారు. దీంతో కొంతమంది.. వ్యాపారులతో వాదనకు దిగారు. పాతనోట్లు తీసుకుని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని వాదులాడారు. అయినా వ్యాపారులు వినలేదు. కొందరు మాత్రం రూ.300 మద్యానికి రూ.500 నోటు తీసుకుని చిల్లర లేదని చెప్పి పంపేశారు.