విభేదాలు.. మళ్లీ మొదటికి..
► వర్గాల వారీగా గేట్‌మీటింగ్‌లకు హాజరు
► అధికార పార్టీకి తలనొప్పిగా మారిన టీబీజీకేఎస్ వ్యవహారం
కోల్‌బెల్ట్(భూపాలపల్లి): టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో విభేదాలు మళ్లీ మొదటికి వచ్చాయి. నాయకత్వం మూడు వర్గాలుగా చీలిపోవడంతో.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్‌లో విభేదాలు తలనొప్పిగా మారాయి. ఈ గ్రూపుల తగాదా త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలో అధికార పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది..
సింగరేణిలో 2012లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అధ్యక్ష, కార్యదర్శులుగా కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి గెలుపొందారు. వారిద్దరి ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు యూనియన్ కార్యకలాపాలు సజావుగా సాగాయి. తర్వాత కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో యూనియన్ లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకోవటం జరిగింది. అది తీవ్రస్థాయికి చేరి కోర్టుకు సైతం వెళ్లారు. ఈ క్రమంలో రెండు వర్గాల బలాబలాలను తెలుసుకోవడం కోసం 2014లో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించారు. ఇందు లో మిర్యాల రాజిరెడ్డి ప్యానల్ విజయం సాధిం చింది. రెండేళ్లపాటు రాజిరెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ కార్యకలాపాలు కొనసాగాయి.
అప్పటికి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగి సింది. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత నూతన కమిటీని నియమించింది. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ఉపాధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కెంగర్ల మల్లయ్యను నియమించారు. దీంతో అప్పటి వరకు యూనియన్ లో రెండు వర్గాలు ఉండగా.. వెంకట్రావు నియామకంతో మరో వర్గం ఏర్పడినట్టయింది.
ఎవరి మీటింగ్‌లకు వారే..
గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరలో జరుగనుం డగా ప్రభుత్వం ప్రకటించిన వారసత్వ ఉద్యోగాలు సాధించింది టీబీజీకేఎస్ అని ప్రచారం చేయడం కోసం సింగరేణి వ్యాప్తంగా గనుల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1,2,5,6 కేఎల్పీ గనుల వద్ద డిసెంబర్‌లో పలుమార్లు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్‌ల్లో బి.వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు. వేర్వేరుగా గేట్ మీటింగ్‌లు నిర్వహించిన క్రమంలో ఎవరి వర్గం వారికే హాజరుకావడం జరిగింది. దీంతో విభేదాలు మరోసారి స్పష్టంగా బయటపడ్డాయి.
కమిటీల రద్దు ఉత్తమాటేనా..
గత ఏడాది ఆగస్టు మాసంలో ముగ్గురు నాయకులతో కూడిన నూతన కమిటీని గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఆ సమయంలో సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్న కమిటీలు రద్దు అవుతున్నట్లు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు సైతం పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు ఏరియాల్లో మూడు వర్గాలను కలుపుకుంటూ ఎన్నికల కమిటీలను కూడా వేయటం జరిగింది. కానీ ఆయా కమిటీలు స్థానికంగా పని చేయడం లేదు. మిర్యాల రాజిరెడ్డి హయాంలో వేసిన కమిటీలే ఇప్పటికీ కొనసాగుతుండగా.. వారికే యాజమాన్యం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఎన్నికల కమిటీలు నామమాత్రంగా మిగిలాయి.