పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
యలమంచిలిలంక (యలమంచిలి) : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు. యలమంచిలిలంకలోని పాలవెల్లి రిసార్ట్స్‌లో శనివారం జరిగిన కోనసీమ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు. పర్యాటకాన్ని ప్రోత్సాహించి ఇతర దేశాల, రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం లక్ష్యమన్నారు. గతేడాది రాష్ట్రంలో పర్యాటక రంగంలో 6.9 శాతం వృద్ధి రేటు సాధించామని, దానిని 10 శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్న విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న ఇన్వెస్టర్లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కాంటంనేని భాస్కర్ మాట్లాడుతూ జాతీయ రహదారులు అందుబాటులో ఉన్న ప్రాంతంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. మన జిల్లా మీదుగా మూడు జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు వెళ్లడం అదృష్టమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని పర్యాటక ప్రాజెక్టులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు కావాలి్సన అనుమతులు వారం రోజుల్లో మంజూరుచేస్తామని చెప్పారు. జిల్లాలో 2.7 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టులు చేపడితే అవి విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీపీసీసీఐఎఫ్ చైర్మన్ కె.లక్ష్మీనారాయణ, పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ టీవీఎ న్ రావు, ఏపీ టీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కండేయులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ముత్తవరపు మురళీకృష్ణ, జి.సాంబశివరావు, కేవీఎస్ ప్రకాష్, పొట్లూరి భాస్కరరావు, పాలవెల్లి రిసార్ట్స్ ప్రతినిధి సుధారాణి, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు బి.శ్రీనివాసరావు, ఎస్.లవణ్, గోవా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటక రంగ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.