లక్ష పోస్టుకార్డులతో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన
రాజానగరం :రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోనందుకు ప్రభుత్వానికి తమ నిరసనను ఒక లక్ష పోస్టు కార్డుల ద్వారా తెలియజేస్తున్నామని కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి. కనకరాజు తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొంటున్నారన్నారు. 2014 సెప్టెంబర్‌లో మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేస్తున్నట్టుగా సీఎం ప్రకటించి, చేతులు దులుపుకున్నారన్నారు.16 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు.