క్రమబద్ధీకరించకపోతే ఆమరణ దీక్ష
-
కాంట్రాక్టు అధ్యాపకుల మహాధర్నాలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. జోన్–1, 2 పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ, కళాశాలలు ప్రారంభమై రెండు నెలల గడుస్తున్నప్పటికీ కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు.
‘కార్పొరేట్ల’ కోసం మంత్రుల తహతహ : రాజా
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, కళాశాలల ప్రారంభానికి ముందే లెక్చరర్లను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలైన చైతన్య, నారాయణ కాలేజీలను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే మంత్రి నారాయణ, తన వియ్యంకుడు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుట్రపూరితంగా ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ఆర్జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ, జిల్లా అధ్యక్షుడు వి.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.