
అసెంబ్లీ ముట్టడిస్తాం
రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు.
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలోని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం వద్ద జీవో నంబర్ 151 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ టీడీపీ నేతలకు చెందిన ఏజెన్సీల గుప్పెట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మగ్గిపోతున్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న కలెక్టరేట్ల వద్ద ధర్నాల చేస్తామని చెప్పారు. డీఎల్‌ఎంటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసం చేశారన్నారు.
ఎమ్మెల్సీల సంఘీభావం
సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, దేవానంద్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అజయ్‌శర్మ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడి వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. డీఎంఎల్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతాజీ, ఐఈఆర్టీఎఫ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బాబు, సీఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అప్పారావు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఐఈఆర్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, 13 జిల్లాలకు చెందిన సుమారు 500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.