బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ రోడ్డును ఆనుకుని ఆంధ్రా యూనివర్సిటీ నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌తోపాటు ఆ ప్రాంగణంలో ఉన్న 3 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దాదాపు రూ.200 కోట్ల విలువైన భూమిని పీపీపీ విధానంలో తమపరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల యూనివర్సిటీ ఆస్తులను ఇతరులకు ధారాదత్తం చేయకూడదన్న నిబంధన ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న పన్నాగం ఇలా ఉంది...
నిధుల కొరతతో పూర్తికాని కన్వెన్షన్ సెంటర్
విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తనకు చెందిన 3 ఎకరాల్లో ఆంధ్రా యూనివర్సిటీ 2011లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో రూ.12కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశలో ఆ కన్వెన్షన్ సెంటర్‌కు కుడి, ఎడమ వైపుల షాపింగ్ కాంప్లెక్స్, క్యాంటీన్లు, మరికొన్ని సెమినార్ హాల్స్ తదితరమైనవి నిర్మించాలని భావించారు.
నిధుల కొరతతో మొదటి దశ పనులకు కేవలం రూ.6కోట్లు మాత్రమే యూనివర్సిటీ కేటాయించడంతో నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. దాంతో రెండో దశ పనులను చేపట్టకూడదని నిర్ణయించారు. యూనివర్సిటీ అవసరాలకు కన్వెన్షన్ సెంటర్ సరిపోతుందని.. రెండోదశ అవసరం లేదని తీర్మానించారు. ఇటీవల విశాఖ నగరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కూడా ఈ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించడం గమనార్హం. ఆ కన్వెన్షన్ సెంటర్ పనులు పూర్తి చేయడానికి మిగిలిన రూ.6కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు.
ప్రభుత్వం ముసుగులో అస్మదీయులకు
దాదాపు రూ.200కోట్ల విలువైన బీచ్‌రోడ్డులోని ఆ కన్వెన్షన్ సెంటర్‌పైనా, దాని భూములపైనా ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. విశాఖ నగరంలో జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, మెగా ఈవెంట్ల నిర్వహణకు బీచ్‌రోడ్డులోని స్టార్ హోటళ్లకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఈనేపథ్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌తోపాటు దాని ప్రాంగణంలోని విలువైన భూములను తమపరం చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు.
మొదటగా ఈ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వమే తీసుకుని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్వహించే విధంగా పన్నాగం పన్నారు. ఇందులోనూ లోగుట్టు వేరేగా ఉంది. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్వహించడానికి ప్రాఫెషనలిజం ఉన్న సంస్థలే చేయగలవనే వాదనను లేవనెత్తారు. అందుకే పీపీపీ విధానంలో ఆ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రతిపాదించారు. పీపీపీ ముసుగులో రూ.200కోట్ల విలువైన భూములతో సహా ఆ కన్వెన్షన్ సెంటర్‌ను తమ సన్నిహితులకు కట్టబెట్టాలన్న యోచనతో కార్యాచరణకు ఉపక్రమించారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా రెండో దశ పనులకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అందుకోసం ఆ ప్రాంగణంలో యూనివర్సిటీ క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ క్వార్టర్లను కూల్చివేసి మొత్తం భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు పనులు వేగవంతం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయాల ఆస్తులను ప్రభుత్వానికిగానీ ప్రైవేటు సంస్థలకుగానీ అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. కానీ నిబంధలను బేఖాతరు చేస్తూ రూ.200కోట్ల విలువైన ఆంధ్రా యూనివర్సిటీ భూములను ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు కట్టబెట్టేందుకు పన్నాగం పన్నడం విమర్శలకు తావిస్తోంది.