దూది కూడా లేని ఆసుపత్రులెందుకు?
– ప్రజా సంఘాల ఆగ్రహం
– నిధులున్నా మందులు కొనరంటూ ఆరోపణ
– పెద్దాసుపత్రి ఎదుట ధర్నా
కర్నూలు(హాస్పిటల్): రోగులకు బ్యాండేజి క్లాత్, దూది కూడా ఇవ్వలేని ఆసుపత్రులు ఎందుకని ఐద్వా, డీవైఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో రూ.9కోట్లకు పైగా నిధులు మూలుగుతున్నా రోగులకు మందులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలపై సోమవారం సీపీఎం ప్రజాసంఘాలు ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రతిరోజూ వివిధ జిల్లాల నుంచి రెండువేలమందికిపైగా చికిత్స కోసం వస్తారన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్యాండేజ్ క్లాత్, దూది ఇవ్వకుండా బయటకు రాస్తుండడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కువశాతం వైద్యపరీక్షలు సైతం బయటకే పంపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉన్నా వారితో మందులు, వైద్యపరీక్షల కోసం ఖర్చు పెట్టిస్తుండడం సరికాదన్నారు. ఈ పథకం కింద వచ్చిన నిధులు రూ.9కోట్లకు పైగానే ఉన్నాయని, వాటితో మందులు, పరికరాలు కొనే అవకాశం ఉన్నా జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఆసుపత్రి అభివద్ధి కమిటి సమావేశం రెండేళ్లయినా జరగడం లేదన్నారు. వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వై. శ్రీనివాసులుకు వినతి పత్రం సమర్పించారు. డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, రామకష్ణ, నాయకులు ఎల్లప్ప, చంద్రశేఖర్, చరణ్, ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు ఉమ, కె. అరుణ, నాయకులు పీఎస్ సుజాత, పాణ్యం డివిజన్ నాయకులు సి. ప్రమీల, కేఎస్ పద్మావతి పాల్గొన్నారు.