పత్తి, వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాభావంలోనూ పత్తి, వరి ధాన్యం పం డించిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ ఇచ్చే మద్దతు ధరతోపాటు పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 900, వరి ధాన్యానికి రూ. 200 రైతు సంక్షేమనిధి నుంచి ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు.
బాధితు లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షలు శాశ్వత పరిష్కారం కాదని, రైతుకు వెన్నుదన్నుగా నిలిచేలా చర్యలు ఉండాలన్నారు. నియోజకవర్గానికి 400 ఇళ్లు అంటే గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లేదా మూడు ఇళ్లే మంజూరు అవుతాయని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోలాగా శ్యాచురేషన్ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించాలన్నారు.
సీపీఎం నుంచి భారీగా చేరికలు...
మధిర డివిజన్‌లో సీపీఎం నుంచి భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఎంపీ పొంగులేటి సమక్షంలో సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, మండల కార్యదర్శి చితా ్తరు నాగేశ్వరరావు, మధిర నగర పంచాయతీ కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, వేముల శ్రీను, డివిజన్ కమిటీ నేతలు శెట్టిపల్లి మదనమోహన్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నేత ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.