కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా..
వరంగల్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని చింతకుంట గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లబెల్లి మండలం గుళ్లపహాడ్ గ్రామానికి చెందిన దంపతులు కేలోతు రాజు (25), అనిత (23) పొట్టకూటి కోసం ఆరేళ్ల కిందట చింతకుంటలో స్థిరపడ్డారు.
స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేస్తున్నారు. పెట్టుబడులకు డబ్బులు లేక పోవడంతో.. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి భార్యా భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇది గమనించిన స్థానికులు వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాజు మృతి చెందగా... అనిత పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.