
వధువు గోవు.. వరుడు బసవన్న..
-తాటిపర్తిలో వైభవంగా వివాహ వేడుక
-ఊరేగింపు, ఊరంతటికీ విందు
గొల్లప్రోలు (పిఠాపురం) : సంరక్షణలేక వేలాది పశువులు మృత్యువాత పడుతున్న రోజులివి. కసాయి కత్తులకు బలవడానికి వేలాదిపశువులు కబేళాలకు తరలిపోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో పశువులకు కల్యాణం జరిపించి, వాటితో అనుబంధాన్ని, వాటి పరిరక్షణ అవసరాన్ని చాటారు మండలంలోని తాటిపర్తి గ్రామస్తులు. ఆవు–తాడిపెద్దు(బసవన్న)ల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆవును, బసవన్నను పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడుగా అలంకరించి..నుదుటిని బాసికం కట్టి...శరీరంపై వస్త్రాలు పరచి పొరుగుగ్రామమైన శంఖవరానికి చెందిన రెండు తాడిపెద్దులు తోటి పెళ్లి కొడుకులుగా, గ్రామస్తులు పెళ్లిపెద్దలుగా హాజరై వేదమంత్రోచ్చారణల మధ్య కల్యాణం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.
అనంతరం గ్రామస్తులు ఊరి బంతితో విందు ఆరగించారు. స్థానిక పెదరామాలయం వద్ద జరిగిన ఈ పెళ్లి తంతు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. కాకినాడకు చెందిన భాగవతుల నాగమహాసయ తాడిపెద్దును చిన్నవయసులో ఉండగా స్థానిక అపర్ణాదేవి అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆలయసంరక్షణలో పెరిగిన తాడిపెద్దుకు పెళ్లిచేయాలనే సంకల్పంతో దైవజ్ఞరత్న ఆకొండి వెంకటేశ్వరశర్మ సూచనతో గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు, శేషారత్నం దంపతులు ఆవును కన్యాదానంగా చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా విఘ్నేశ్వరపూజ, లక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం తాడిపెద్దుకు దాసుడితో అచ్చు వేయించారు.
వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించి, కల్యాణం జరిపించారు. అనంతరం ఆవు, తాడిపెద్దుల గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఆవు, తాడిపెద్దుల కాళ్లుకడిగి..నుదుట బొట్టుపెట్టి పూజలు చేశారు. దుస్తులు, తవుడు, బియ్యం వంటివి కానుకగా సమర్పించారు. తప్పెటగుళ్లు, శూలాల సంబరం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ తాటిపర్తిలో గతంలో తాడిపెద్దులకు కల్యాణం చేయించి, అచ్చు వేయించినట్టు చెప్పారు. పదేళ్ల తరువాత ఇప్పుడు ఈకార్యక్రమం జరిపించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకృష్ణుడు గోవర్థనగిరి పర్వతం ఎత్తే సమయంలో బసవన్నకు పూజలు చేశాడని దామాల కొండలరావు తెలిపారు. ప్రతి గ్రామానికి తాడిపెద్దు, రామాలయం, పెరుమాళ్ల స్తంభం ఉండాలని పురాణాలు చెబుతున్నాయన్నారు.