అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన
-
కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కాకినాడ సిటీ :
తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్వాసిత రైతుల పోరాటానికి అండగా నిలిచిన నాయకులను అక్రమ అరెస్టు చేయడంపై సీపీఎం కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జిలతోపాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, శ్రామిక మహిళా నేత ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ నెల రోజులుగా తొండంగి మండలంలో ఐదు గ్రామాల రైతులు పోరాడుతున్నారన్నారు. వారి పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరగా అన్నవరం పోలీస్‌స్టేçÙన్‌లో నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో రైతులపై నిర్బంధానికి వందలాది మంది పోలీసులను మోహరించారంటే రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన కాకుండా పోలీసురాజ్యం నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే ఇతర వామపక్షాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.