కదంతొక్కిన గొర్రెల కాపరులు | shepheards darna at collectarate | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన గొర్రెల కాపరులు

Published Thu, Sep 8 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న గొల్లకురుమలు

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న గొల్లకురుమలు

  • సమస్యల పరిష్కారంపై సర్కారు వివక్ష
  • సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
  • గొర్రెల పెంపకందారుల ధర్నాలో రాష్ట్ర నేతలు
  • డోలు, గొంగళ్లతో భారీ ర్యాలీ
  • ముకరంపుర : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. గొర్రెలపెంపకందారులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గొర్రెల పెంపకందారులు.. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. అంతకుముందు డోలుచప్పుళ్లు, గొంగళ్లతో సర్కస్‌గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల పెంపకంవృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల్వనర్సయ్య యాదవ్, అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొర్రెలు, మేకల పెంపకందారుల పట్ల సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపించారు. బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, నాబార్డు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా 80 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 50 ఏళ్లు దాటిన గొల్ల, కుర్మలకు నెలకు రూ.3వేల పింఛన్‌ ఇవ్వాలన్నారు. వారి సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఫెడరేషన్‌ ద్వారా ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు.
    గొర్రెల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వాలన్నారు. గొర్రెల విక్రయానికి మండలాలవారీగా మార్కెట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ప్రాథమిక సంఘానికి 25 ఎకరాల భూమి కేటాయించాలని, ఎక్స్‌గ్రేషియాను రూ.6లక్షలకు పెంచాలని సూచించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌కు అందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నూనె అంజయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న, కన్నెబోయిన ఓదెలు, మహిళా సంఘ అధ్యక్షురాలు చెర్ల పద్మ, బీర్ల కనకయ్య, మేకల నర్సయ్య, పలుమారు మల్లేశ్, పొట్టాల హన్మంతు, సాయిల్ల రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement