వేతనాలివ్వకండా వేధిస్తున్నారు..
వేతనాలివ్వకండా వేధిస్తున్నారు..
Published Wed, Aug 17 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన
కమిషనర్ హామీతో ఆందోళన విరమణ
తుళ్ళూరు: వెట్టిచాకిరీ చేయించుకుని వేతనాలు ఎగ్గొట్టారని ఆరోపిస్తూ పారిశుద్ధ్యకార్మికులు మంగళవారం తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వేతనాలు వెంటనే ఇవ్వాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సీఐటీయూ రాజధాని కమిటీ కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్, సీపీఎం రాజధాని డివిజన్ నాయకుడు జె.వీర్లంకయ్యల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నెలరోజులపాటు పనులు చేయించుకుని రెండునెలలు కావస్తున్నా కూలిడబ్బులు ఇవ్వలేదని వివరించారు. పంచాయతీ అధికారులను అడిగితే సీఆర్‌డీఏ అధికారులను అడగమంటున్నారని, సీఆర్‌డీఏ అధికారులను అడుగుతుంటే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. గత్యంతరంలేక ఆందోళనకు దిగామని వివరించారు. ఈ మేరకు తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం అధికారి కేశవనాయుడికి వినతిపత్రం సమర్పించారు. దీంతో కేశవనాయుడు సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ కమిషనర్ మల్లికార్జునరావులతో మాట్లాడారు. వచ్చే గురువారం లోగా బకాయి కూలి చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. అధికారులు చెప్పిన మాటప్రకారం నాలుగు రోజులలో బాధితులకు కూలి డబ్బులు ఇవ్వకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకుడు జె.నవీన్‌ప్రకాష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎలా బతకాలి..
వెలగపూడి గ్రామం నుంచి 30 మందిని తీసుకుని తాడేపల్లి మండలం పెనుమాక, తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామాలలో సుమారు నెలరోజులు పారిశుద్ధ్యం పనులు చేశాం. అలవాటు లేకపోయినా రూపాయి అక్కరకు వస్తుందని కష్టపడ్డాం. రెండునెలలు కావస్తున్నా కూలి డబ్బులు ఇవ్వలేదు. తోటి కూలీలతో ఇబ్బందులు పడుతున్నాను. 500 మందికి మచ్చర్లు రావాలి. ఇన్నాళ్లు డబ్బులు ఇవ్వకుంటే ఎలా బతకాలి.
– భూలక్ష్మి, కార్మికురాలు, వెలగపూడి
Advertisement