► సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
► అఖిలపక్ష, వ్యవసాయ
► కార్మిక సంఘాల మద్దతు
సాక్షి, విజయవాడ బ్యూరో/గాంధీనగర్/
తుళ్లూరు: రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మొం డిగా వెళితే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. భూములు సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవడంతో పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, కురగల్లు, బేతపూడి గ్రామాల రైతుల్లో ఆందోళన పెరిగింది. వారికి మద్దతుగా ఏపీ రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి.
పంటలతో ప్రదర్శన.. నిరసనలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం ఆందోళనలు చేపట్టిన అన్నదాతలు శుక్రవారం కూడా రోడ్డెక్కారు. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని కోరుతూ ఏపీ రైతు, రైతుకూలీ, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారులు, ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించింది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలతో ప్రదర్శన నిర్వహించారు.
మంత్రి నారాయణకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన ఆస్తులను రాజధాని నిర్మాణానికి ఇవ్వాలని సవాల్ విసిరారు. భూసేకరణ నిలుపుదల చేయాలని కోరుతూ సీఆర్‌డీఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, డెల్టా పరిరక్షణ సమితి నాయకులు కె.శివాజీ రైతులు పాల్గొన్నారు.
నేడో రేపో హజారే కార్యదర్శి రాక... వారం రోజుల్లో పవన్ కల్యాణ్..?
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే రాజధాని నిర్మాణ ప్రాంతానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. నేడో రేపో హజారే కార్యదర్శి ఇక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడనున్నారని రైతుసంఘ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. బేతపూడి, యర్రబాలెం, ఉండవల్లి రైతులు కొందరు ఇటీవల హైదరాబాద్ వెళ్లి ఆయనతో చర్చించారు. వారం రోజుల్లో మంగళగిరి ప్రాంతానికి వస్తానన్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో రైతుల వాగ్వాదం
గ్రామ కంఠాల సమస్యల విషయంలో తమను ఏమాత్రం సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని తుళ్లూరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు శుక్రవారం స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఈ సాధనతో వాగ్వాదానికి దిగారు. రైతుల అభిప్రాయాలను సీఆర్‌డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళతానని కేఈ సాధన చెప్పారు.
‘భూసేకరణ’పై నిరసనల వెల్లువ
Published Sat, Aug 22 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement