సాక్షి, విజయవాడ బ్యూరో: భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధ సైజుల్లో నివాస, వాణిజ్య స్థలాలను రైతులకు ఎలా ఇవ్వాలనే అంశాలను నిర్ణయించింది. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాట్ల కేటాయింపు విధానానికి అంగీకారం తెలిపారు. ఒక రెవెన్యూ గ్రామంలో భూములిచ్చిన రైతులకు అదే గ్రామంలో నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మెట్ట భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో, జరీబు భూములిచ్చిన వారికి జరీబు ప్లాట్లు ఇవ్వనున్నారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకిచ్చిన మాట ప్రకారం అదనంగా రైతులకు మరో 50 గజాల వాణిజ్య స్థలాన్ని ఇస్తూ ఈ ప్లాట్ల కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రైతులకిచ్చే లేఅవుట్లలో నివాస స్థలాలు 120 చదరపు గజాల నుంచి నాలుగు వేల చదరపు గజాల వరకూ వివిధ సైజుల్లోనూ, వాణిజ్య స్థలాలను 30 గజాల విస్తీర్ణం నుంచి ప్రారంభించి 30 గజాల చొప్పున పెంచుకుంటూ నాలుగు వేల గజాల వరకూ వివిధ సైజుల్లో ఇవ్వడానికి సిద్ధం చేసిన ప్రణాళికను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రైతులకు దక్కాల్సిన ప్లాటు కనీస విస్తర్ణం తక్కువగానూ, నిర్దేశిత విస్తీర్ణం కన్నా ఎక్కువగానూ ఉంటే అలాంటి వారికి ఉమ్మడి ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ ప్లాట్లను వేలం వేసి వచ్చే సొమ్మును దామాషా పద్ధతిలో రైతుల వాటా ప్రకారం పంచుతారు.
ఒకవేళ ఎవరైనా ఉమ్మడి ప్లాటు వద్దనుకుంటే అభివృద్ధి హక్కు కలిగి, అమ్ముకునేందుకు వీలుండే (టీడీఆర్) బాండ్లు తీసుకునే వెసులుబాటును రైతులకు ఇవ్వనున్నారు. ఈ కేటాయింపు విధానానికి నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజుల్లో 9.18 ఎ, 9.18 బి ఫారాలను భూయజమానులు దరఖాస్తు చేయాల్సివుంటుంది. దరఖాస్తు చేయని వారికి అర్హతలను బట్టి దక్కాల్సిన ప్లాట్లను, నిర్దేశిత విస్తీర్ణం కన్నా తక్కువైనా, ఎక్కువైనా ఉమ్మడి ప్లాట్ ఇస్తారు. భూ యజమానులు తమకు దక్కే వాటాను బట్టి ఒకటి లేదా రెండు అంతకుమించి ప్లాట్లను ఒకేచోట కోరుకోవచ్చు.
ఇద్దరు అంతకంటె ఎక్కువ మంది కలిసి ఉమ్మడిగా ప్లాట్లను అడిగేందుకూ అవకాశం ఇస్తున్నారు. మే నెలాఖరు నుంచి ప్లాట్లను రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఒకటి, రెండు రోజుల్లో గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు నోటిఫికేషన్లు ఇవ్వాలని, తుళ్లూరు మండలం నేలపాడు నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, సీసీడీఎంసీ ఛైర్మన్ లక్ష్మీపార్థసారథి, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం ఖరారు
Published Tue, Apr 26 2016 10:40 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement