రబీ రుణాలు
Published Thu, Dec 1 2016 2:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
బ్యాంకుల చుట్టూ రైతన్నల నిత్య ప్రదక్షిణలు పాత నోట్ల రద్దుతో అప్పు ఇవ్వని బ్యాంకర్లు రూ.400 కోట్లకు చెల్లించినవి రూ.100 కోట్లే..పెట్టుబడుల కోసం కర్షకుల పాట్లునేడు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష
నల్లగొండ అగ్రికల్చర్ : పంట రుణాలు రైతులకు అందని ద్రాక్షలా మారాయి. రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులకు పైగా అవుతున్నా.. రైతులకు ఇంకా పంట రుణాలు అందని పరిస్థితి నెలకొంది. బ్యాంకర్లు రుణాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించే సమయానికి కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో రుణాల పంపిణీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. బ్యాంకుల్లో కొత్త నోట్లు రాకపోవడం.. పాత నోట్ల డిపాజిట్‌కు ప్రజలు బ్యాంకుల వద్ద బారులుదీరడంతో బ్యాంకు సిబ్బంది బిజీబిజీ అయ్యారు. దీంతో రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. రబీలో నల్లగొండ జిల్లాలోని రైతులకు సుమారు రూ.400 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.వంద కోట్లు కూడా పంపిణీ కాలేదు.
సీజన్ వచ్చి నెత్తిన కూర్చుని నెల రోజులు కావడం.. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, ట్రాక్టర్ల దున్నకాలు, కూలీల డబ్బులను చెల్లించడం వంటి పెట్టుబడుల కోసం అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినప్పటికీ.. అక్కడ అదే పరిస్థితి ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ పత్తి, ధాన్యం అమ్మినప్పటికీ.. చెల్లని నోట్లు చిల్లర తంటాలతో సాగు చేయలేకపోతుండడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రైవేట్ వ్యాపారులు కూడా అప్పులు ఇవ్వకపోవడం రబీ సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో 70,942 హెక్టార్లలో వరి ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంట రుణాలు అందని కారణంతోపాటు పెట్టుబడులు లేక రైతులు ఇప్పటివరకు కేవలం నాలుగువేల హెక్టార్లు కూడా సాగు కాకపోవడం గమనార్హం.
నేడు బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం
నల్లగొండ పట్టణంలో గురువారం జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. పంటరుణాలు, పంటల బీమా పథకం అమలు తీరుపై బ్యాంకర్లతో కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంపై రైతులు బోలెడంత ఆశలు పెట్టుకున్నారు. రబీ పంట రుణాలు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నారు.
Advertisement
Advertisement