పంట రక్షణలో రైతుకు అండగా నిలుద్దాం
పంట రక్షణలో రైతుకు అండగా నిలుద్దాం
Published Fri, Oct 28 2016 9:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
- పంటల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
కర్నూలు (అగ్రికల్చర్): వర్షాభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు వాడు దశకు చేరుకుంటున్నాయని, ఈ క్రమంలో వాటి రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా పంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మండలాలకు కేటాయించిన రెయిన్‌గన్‌లు, పైపులైన్‌లు, ఆయిల్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్లు తదితర సదుపాయాలు అవసరమైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచామని, వీటిని ఉపయోగించి ఒక్క ఎకరాలో కూడా పంట ఎండకుండా రక్షక తడులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు మండలాల వ్యవసా«యాధికారులు అరకొర సమాచారంతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ మూడు గ్రామాలకు వెళ్లి పంటల పరిస్థితిపై సమగ్రంగా పరిశీలించి నివేదికలు రూపొందించాలని ఆదేశించినా అరకొరగా వివరాలు అందచేయడంపై మండిపడ్డారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయాధికారులు కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి రైతుల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయి టీమ్‌లు పంటలను కాపాడే బాధ్యతను తీసుకోవాలని వివరించారు. వాగుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడిక తీత పనులకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామన్నారు. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ తగిన స్థాయిలో అధికారులు పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఏడీఏలు పాల్గొన్నారు.
Advertisement