- పుష్కర స్నానానికి తరలివచ్చిన జనం
- మూడో రోజు 12500 మంది పుణ్యస్నానాలు
పులకించిన గోదారమ్మ
Published Tue, Aug 2 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ధర్మపురి/మంథని/ కాళేశ్వరం: గోదారమ్మ పులకించింది. అంత్యపుష్కరాల మూడో రోజు మంగళవారం వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ తగ్గిందని పండితులు పేర్కొంటున్నారు. ధర్మపురిలో సుమారు 10 వేల మంది స్నానాలు ఆచరించారు. సంతోషిమాతా ఘాట్ వద్ద 2500 మంది, మంగలిగడ్డ ఘాట్ వద్ద 3000, సోమవిహార్ ఘాట్ వద్ద 4500 మంది స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. మహిళలు గోదారమ్మకు వాయినాలు సమర్పించారు. పోలీసులు భక్తులు ఇబ్బంది పడకుండా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మంథని గోదావరి వెలవెలబోయింది. అమవాస్య కారణంగా తక్కువమంది స్నానాలు ఆచరించారు. సుమారు వేయి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు పండితులు వెల్లడించారు. అమవాస్య కలిసి రావడంతో చాలామంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తర్పణాలు సమర్పించుకున్నారు. బుధవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంలోని గోదావరి పుష్కరఘాట్లు వెలవెలబోయాయి. మూడో ఇక్కడ సుమారు 15 వందల మంది పుణ్యస్నానాలు ఆచరించారని పండితులు వివరించారు. సాయంత్రం గోదావరికి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, డీఎల్పీవో శ్రీనివాస్, ఆలయ మాజీ ధర్మకర్త మెంగాని అశోక్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ఫణీంద్రశర్మ, ప్రశాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
అంత్యపుష్కరాల సందర్భంగా కాళేశ్వరాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద, తెలంగాణ పాటలు పలువురిని ఉర్రూతలూగించాయి. సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని ఈవో డి.హరిప్రకాశ్‌రావు వెల్లడించారు.
Advertisement
Advertisement