తొలగని నగదు వెతలు
– ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో పోటెత్తిన జనాలు
–వారం రోజులుగా జిల్లాకు రాని కొత్త కరెన్సీ
– అన్ని వర్గాలకు అర్థిక ఇబ్బందులే..
కర్నూలు(అగ్రికల్చర్): ఆదివారం సెలవు కావడంతో శనివారం అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులకు పోటెత్తారు. నో క్యాష్ బోర్డులు చూసి అందోళనకు గురయ్యారు. కర్నూలులోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ కీలకమైంది. ఈ బ్రాంచీలోనూ నో క్యాష్ బోర్డు పెట్టారు. జిల్లాకు ఈ నెల 9వ తేదీ రూ.75కోట్ల నగదు వచ్చింది. ఎస్‌బీఐకి వచ్చిన నగదు ఆ బ్యాంకు ఒక్కటే ఉపయోగించుకుంది. ఆంధ్రా బ్యాంకుకు వచ్చిన నగదును ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఇతర బ్యాంకులకు పంపిణీ చేశారు. వారం రోజులుగా జిల్లాకు ఎలాంటి నగదు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. జిల్లాలో485 ఏటీఎంలు ఉండగా.. 10 కూడా పనిచేయడం లేదు. బ్యాంకుల్లో నగదు నిల్వలు అడుగుంటిపోవడం, ఏటీఎంలు మూత పడటం వల్ల నగదు సమస్యలు రెట్టింపయ్యాయి. నోట్ల రద్దుతో ఇప్పటి వరకు దాదాపు రూ. 8000 కోట్లు బ్యాంకులకు డిపాజిట్లుగా వచ్చాయి. ఇందులో జిల్లాకు కొత్త కరెన్సీ 10 శాతం కూడా రాలేదు. ప్రజల దగ్గర ఉన్న డబ్బు బ్యాంకులకు వెళ్లినా ఆ స్థాయిలో ప్రజల్లోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.