కర్నూలు(అగ్రికల్చర్): నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని..డబ్బు కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన వారికే నిరాశే మిగిలింది. నగదు కొరతతో కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే అవకాశం లేకుడా పోయింది. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను పెద్ద ఎత్తున చేపడుతారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ .. రెండు రోజులు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తారు. విందు, వినోదాలు, మందు పార్టీలు పెద్ద ఎత్తున ఉంటాయి. స్వీట్లు, పండ్లు, పూలు, బొకేలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. రెండు రోజుల్లో జిల్లాలో రూ.50కోట్లు ఖర్చు అవుతాయనే అభిప్రాయం ఉంది. నగదు కొరతతో ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆర్‌బీఐ వారంలో రూ.24వేలు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చినా రూ.2వేలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నూతన సంవత్సర వేడుకలు మసకబారుతున్నాయి. జిల్లాకు శుక్రవారం రూ.135కోట్ల కొత్త కరెన్సీ వచ్చినా..పంపిణీ అంతంతమాత్రంగానే ఉంది.