కరెంటోళ్లకు.. కాసుల దాహం
కరెంటోళ్లకు.. కాసుల దాహం
Published Mon, Jul 10 2017 11:35 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
- విద్యుత్ శాఖలో రాజ్యమేలుతున్న అవినీతి
- ప్రతి పనికీ ఓ రేటు..
- పైసలివ్వందే కదలని ఫైళ్లు
- ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.లక్షన్నర.. కనెక‌్షన్‌కు రూ.20 వేలు
- ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు
- ఆళ్లగడ్డ ఏడీఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు
- విద్యుత్ శాఖలో కలకలం
కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించారు. కొత్త కనెక‌్షన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ వరకు ఏది కావాలన్నా చేతులు తడపాల్సిందే. వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్‌కు రూ.20 వేలు, స్తంభానికి రూ.5వేలు, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.లక్షన్నర వరకు..ఇలా ఫిక్స్ చేసి డిమాండ్ చేస్తున్నారు.
అడిగినంత ఇస్తేనే పనులు అవుతాయి. లేకపోతే నెలల కొద్ది తిరిగినా ఫైలు కదలదు. మామూళ్ల కోసం వేధింపులు రోజురోజుకూ అధికమవుతుండడంతో బాధితులు విధిలేని పరిస్థితిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఏటా ఏసీబీకి చిక్కుతున్నా.. అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఆళ్లగడ్డ ఏడీఈ నాగరాజుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏక కాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు.
విద్యుత్ కనెక‌్షన్ కోసం అన్ని డాక్యుమెంట్లు, నిర్ణయించిన ఫీజును చెల్లిస్తే రెండు రోజుల్లో మంజూరు చేయాలి. కానీ కనెక‌్షన్ మంజూరు చేయకముందే అర్జీదారుల నుంచి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏ పనికైనా ముందుగా స్థానిక లైన్‌మన్‌ను సంప్రదించాలి. ‘అన్నీ నేనే చూసుకుంటా. ఇంత డబ్బు ఇస్తే కనెక‌్షన్ ఇస్తాము’ అంటూ దందా సాగిస్తున్నారు. లేనిపక్షంలో దరఖాస్తులో సంతకం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. గృహ వినియోగదారుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ముఖ్యంగా నంద్యాల డివిజన్‌లోని ఇద్దరు ఏడీఈలు, ఐదుగురు ఏఈలు, ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లోని ఓ అధికారితో పాటు ముగ్గురు ఇంజినీర్లు, ఆదోని డివిజన్‌లోని ఇద్దరు ఏడీఈలతో పాటు పత్తికొండ సబ్ డివిజన్‌లోని రెండు సెక‌్షన్లలో అధికారుల మామూళ్ల దందా అధికంగా ఉంది. నందికొట్కూరు సబ్ డివిజన్‌లో ఓ అధికారితో పాటు మరో ఇద్దరు ఏఈలు, జిల్లా కేంద్రంలోని ఓ సెక‌్షన్ ఏఈ కలెక్షన్ కోసం వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది ఏడీఈలు, 29 మంది ఏఈలు, సబ్ ఇంజినీర్లపై పెద్దఎత్తున ఆరోపణలు ఉండడం గమనార్హం.
ఆళ్లగడ్డ ఏడీఈపై గతంలో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో సీఈ నరసింహులు విచారణ చేపట్టారు. అయితే.. ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఇదే స్థానంలో పనిచేసిన ఓ అధికారి అవినీతికి హద్దే లేకుండా పోయిందని, రూ.5 కోట్లకు పైగా సంపాదించారని కార్యాలయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ అధికారి పనుల కోసం పీడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
వసూళ్లు ఇలా..
ఇంటి కనెక‌్షన్‌కు రూ.వెయ్యి, త్రీఫేస్ మీటర్‌కు రూ.2వేలు, వ్యవసాయ కనెక‌్షన్‌కు రూ.20వేలు, విద్యుత్ స్తంభానికి రూ.20వేల వరకు, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.లక్ష వరకు చెల్లించుకోవాలి. రుద్రవరం, మహానంది, బండి ఆత్మకూరు, శిరువెళ్ల తదితర ప్రాంతాల్లో అయితే ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.1.50 లక్ష వరకు ఉంటోంది. అపార్ట్‌మెంట్ కనెక‌్షన్లకు ఏఈకి రూ.5వేల నుంచి రూ.10వేలు, ఏడీఈకి రూ.10వేల వరకు, డీఈ కార్యాలయాల్లో వర్క్ ఆర్డర్లు, ఎస్టిమేట్లు పొందేందుకు రూ.5వేలు, పరిశ్రమల కనెక‌్షన్ పొందాలంటే రూ. 20వేల వరకు, ఎస్‌ఈ కార్యాలయంలో కొందరికి అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది. వ్యాపార కనెక‌్షన్‌కు రూ.3వేలు, విద్యుత్ స్తంభం మార్చేందుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు ఏఈలతో పాటు ఏడీఈ, డీఈలకూ వాటా ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అలాగే వినియోగదారుల అవసరాలను బట్టి రేట్లను పెంచేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే కాళ్లరిగేలా తిప్పుకుంటారు.
– ఏసీబీకి చిక్కిన ఘటనలు
– 2012 డిసెంబరు 31న బనగానపల్లె ఏడీఈ రమణారెడ్డి మండలంలోని యర్రగుడి, హుసేనాపురం గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్‌ల మంజూరు కోసం డబ్బు వసూలు చేస్తూ ఏసీబీ చిక్కారు. ఇది వాస్తవమని తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు.
– 2012 మార్చిలో డోన్ డీఈ ప్రకాష్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ నుంచి రూ.50 లంచం తీసుకొని ఏసీబీకి చిక్కారు.
– 2013 మార్చిలో నందవరం ఏఈ గురునాథ్ రూ.20 వేలు, మే 28న మిడుతూరు ఏఈ శ్రీనివాసుల నాయుడు ఇంటికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.8వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
– 2013 మే 22న వడ్డె వెంకటస్వామి అనే కాంట్రాక్టర్ నుంచి బనగానపల్లె విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి సుబ్రమణ్యం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
– 2015లో ఎమ్మిగనూరు ఏడీఈ చంద్రశేఖర్ చేసిన పనులకు బిల్లులు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు.
– 2015లో బనగానపల్లె ఏడీఈ సుధాకర్ ఆచారి క్లాస్- 1 కాంట్రాక్టర్ కిషోర్‌బాబు నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇక్కడ మూడేళ్ల వ్యవధిలో ముగ్గురు అధికారులు చిక్కడం గమనార్హం.
– 2016లో గోస్పాడు ఆపరేషన్స్ ఏఈఈ రామచంద్రుడు ఏసీబీకి పట్టుబడ్డారు. కానాలపల్లె గ్రామానికి చెందిన సి. పుల్లయ్య గోడౌన్‌కు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.లక్ష తీసుకుంటూ దొరికిపోయారు.
– 2013లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ. 50వేలు, వ్యవసాయ కనెక‌్షన్ కోసం రూ.16వేలు లంచం లైన్‌మెన్, ఏఈకి ఇచ్చామని దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ వినియోగదారుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. కృష్ణగిరికి చెందిన రైతు మాధవస్వామి కూడా ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారులకు రూ.60 వేలు చెల్లించానని కోర్టులో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement