
నేడు తీరం దాటనున్న తుపాను
రాష్ట్రానికి రోను తుపాను ముప్పు తప్పింది. తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ తుపాను ప్రశాంతంగానే రాష్ట్రాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ‘రోను’ ఉత్తర కోస్తాలోనే పయనిస్తూ ఒడిశాలోకి ప్రవేశించింది.
- తీవ్ర తుపానుగా మారని ‘రోను’
- నేటి సాయంత్రం బంగ్లాదేశ్‌లో తీరం దాటే అవకాశం
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రానికి రోను తుపాను ముప్పు తప్పింది. తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ తుపాను ప్రశాంతంగానే రాష్ట్రాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ‘రోను’ ఉత్తర కోస్తాలోనే పయనిస్తూ ఒడిశాలోకి ప్రవేశించింది. వాయవ్య బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం సాయంత్రానికి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు సమీపంలో ఖేపుపరా, కాక్స్ బజార్ల మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ముందుగా అంచనా వేసినట్టుగా రోను తీవ్ర తుపానుగా బలపడకుండానే తీరాన్ని దాటుతుందని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పినట్టు ప్రకటించింది. రాష్ట్రానికి అన్ని రకాల తుపాను హెచ్చరికలను కూడా ఉపసంహరించింది.
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తర కోస్తాలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ ప్రస్తుతం ఉన్న నాలుగో నెంబరుకు బదులు రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఉత్తరకోస్తాలోని మత్స్యకారులు రానున్న 24 గంటల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో ఇచ్చాపురం, కళింగపట్నంలలో 15, రణస్థలంలో 14, అమలాపురం, పలాస, అవనిగడ్డల్లో 11, టెక్కలి, మందసల్లో 10, సోంపేటలో 9, విశాఖలో 8 సెం.మీల వర్షపాతం నమోదైంది.
మరో 5 రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాల కారణంగా మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరోవైపు రామగుండం, ఆదిలాబాద్‌లలో శుక్రవారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పలు ప్రధాన పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 45.2
ఆదిలాబాద్ 44.8
నిజామాబాద్ 43.4
హైదరాబాద్ 38.6