దమ్ముంటే మల్లన్నసాగర్ రా..!
హరీశ్‌కు దామోదర సవాల్
సంగారెడ్డి రూరల్: ముంపు బాధితులకు న్యాయం చేయకపోతే జిల్లాలో మంత్రులను అడుగుపెట్టనీయబోమని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి చౌరస్తాలోని 65వ నంబరు జాతీయ రహదారిని ముట్టడించారు. దామోదర మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందా లు కాదు.. దమ్ముంటే మంత్రి హరీశ్‌రావు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటిం చాలని సవాల్ చేశారు.
ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టులను చేపట్టడం మంచిది కాదన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ భూ బాధితులకు పరిహారం చెల్లించడంపై రైతుల పక్షాన చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ముంపు బాధితుల పక్షాన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై ఆందోళన కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు నాయకులను అరెస్టు చేశారు.