
ప్రమాదంలో ఉద్యానం
- కరువు దెబ్బకు పండ్లతోటల విలవిల
- కాపాడుకోవడానికి రైతుల క‘న్నీటి’ కష్టాలు
- ఇప్పటికే ఏడు వేల ఎకరాల్లో ఎండుముఖం
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం
చిన్నూరుబత్తలపల్లికి చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడిది. పదేళ్ల క్రితం వెయ్యి చెట్లు నాటాడు. వీటికి నీరు పెట్టేందుకు నాలుగు బోర్లు వేయించాడు. ప్రస్తుతం అన్నింటిలోనూ నీరు అడుగంటిపోయింది. కనీసం వంద చెట్లకు కూడా అందివ్వలేని పరిస్థితి. దీంతో రైతు రెండు ట్యాంకర్లు తీసుకుని రైతుల వద్ద నీటిని కొనుగోలు చేసి చీనీచెట్లను కాపాడుకుంటున్నాడు. ఇందుకోసం ప్రతిరోజూ రూ.2,500 దాకా ఖర్చవుతోంది.
అనంతపురం అగ్రికల్చర్ / ధర్మవరం : జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే సకాలంలో వర్షాలు కురవక, బోర్లలో నీరు అడుగంటిపోయి అవి నిలువునా ఎండిపోతున్నాయి. వెయ్యి అడుగులు లోతుకు బోర్లు వేసినా నీరు పడక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండుతున్న తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. కొందరు కొత్తగా బోర్లు వేయిస్తుండగా.. మరి కొందరు ట్యాంకర్లతో నీరు తోలుతున్నారు. విపత్తు సంభవించడం ఖాయమని ముందే తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
జిల్లా వ్యాప్తంగా 1.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 22 రకాలకు పైగా పండ్లతోటలు సాగవుతున్నాయి. ఇందులో అత్యధికంగా చీనీ తోటలు 44 వేల హెక్టార్లు, మామిడి 40 వేల హెక్టార్లలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగు వేల హెక్టార్లలో చీనీ తోటలు, రెండు వేల హెక్టార్లలో మామిడి, మరో వేయి హెక్టార్లలో ఇతర పండ్లతోటలు ఎండిపోయాయి. రెండు వేల హెక్టార్లలో మల్బరీ తోటలు కూడా ఎండుముఖం పట్టాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో మరో 15- 20 వేల హెక్టార్లలో పండ్లతోటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వేసవిలో పండ్లతోటల రైతులకు ఎంతలేదన్నా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. చీనీ తోటలకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ‘అనంత’లో ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, శింగనమల, తాడిమర్రి, బత్తలపల్లి, గార్లదిన్నె, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో చీనీ తోటలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. మరో 22 మండలాల్లోనూ కొంత విస్తీర్ణంలో సాగయ్యాయి. ఏటా 6.50 నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. వీటి ద్వారా రైతులు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఒక ఎకరా చీనీ తోట సాగుకు మొదటి సంవత్సరం రూ.40 వేలు ఖర్చవుతుండగా.. రెండో ఏడాది రూ.20 వేలు, మూడో ఏడాది రూ.25 వేలు, నాల్గో ఏడాది రూ.30 వేలు, ఐదో ఏడాది రూ.35 వేలు వెచ్చించాలి.
ఐదేళ్ల తర్వాత మొదటి పంట చేతికి వస్తుంది. ఆ తరువాత కూడా ఏటా రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇలా రూ.లక్షలు వెచ్చించి పెంచిన చీనీ తోటలు ఒక్కసారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఒకవైపు తీవ్ర వేసవితాపం, అరకొర నీటి తడులు ఇవ్వడం వల్ల చీనీకి ఎండుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల దిగుబడులు తగ్గిపోతాయి. నాణ్యమైన ఉత్పత్తులు రావు. మార్కెటింగ్ సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది చీనీ రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది.
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ప్రసిద్ధి గాంచిన ‘అనంత’ను ఉద్యాన హబ్‌గానూ తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈ వేసవిలో పండ్లతోటలను కాపాడడానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చీనీ, మామిడితో పాటు అరటి, దానిమ్మ, బొప్పాయి, కర్భూజా, కళింగర, సపోటా, రేగు, జామ తదితర తోటలన్నీ ప్రమాదంలో పడ్డాయి. వీటిని వేసవి గండం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టడం లేదు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ చూపకపోవడం దారుణమని రైతుసంఘాల నాయకులు మండిపడుతున్నారు. రక్షకతడి అంటూ గత కొంత కాలంగా ఊరిస్తున్నా ఆ దిశగా అనుమతులు రాకపోవడంతో ఉద్యానశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వేరుశనగ పూర్తిగా ఎండిపోయిన తర్వాత రక్షకతడి అంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసి ఒక్క ఎకరా పంటను కాపాడలేకపోయిన ప్రభుత్వం.. పండ్లతోటల విషయంలోనూ అదే చేస్తుందేమోనన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత రక్షకతడులు ఇచ్చినా ప్రయోజనం ఉండదని అంటున్నారు.
బోర్లెన్ని తవ్వినా..
జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి వరుణుడు జాడ కరువైపోయింది. దానికి తోడు ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనమైపోయింది. తోటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా 800 నుంచి 1,000 అడుగుల లోతుకు బోర్లు వేయిస్తూ భగీరథ యత్నం చేస్తున్నారు. అయినా నీటి జాడ దొరకడం లేదు. ఉన్న అప్పులకు తోడు బోర్ల తవ్వకం కోసం కొత్త అప్పులు చేయాల్సి రావడంతో రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోతోంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఉద్యాన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎన్ని బోర్లు వేయించినా చుక్కనీరు పడటం లేదు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు డబ్బు చెల్లించి ఎండిపోతున్న తోటలను కాపాడాలి.
- సుధాకర్‌నాయుడు, చిన్నూరు బత్తలపల్లి, ధర్మవరం మండలం
పరిహారం ఇవ్వాలి
బోరుబావుల్లో నీరురాక తోటలు ఎండిపోతే రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. నేను ఐదెకరాల్లో సుమారు 650 చెట్లను సాగుచేస్తే 300 మేర ఎండిపోయాయి.
-తిమ్మారెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం
బిల్లులు ఇవ్వాలి
రెండు వేల చెట్లకు ప్రతి రోజూ నాలుగు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నాం. రోజుకు దాదాపు ఎనిమిది వేల దాకా ఖర్చు వస్తోంది. ప్రభుత్వం ట్యాంకర్లకు అయ్యే ఖర్చు భరిస్తే కొంత ఊరట లభిస్తుంది. గత ఏడాది బిల్లులు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఈసారైనా ఇవ్వాలి.
- దామోదర్‌రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం
రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపాం: బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్
చీనీ, మామిడి తోటలు ఎండిపోకుండా రక్షకతడి ఇవ్వడానికి రూ.42 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యానశాఖ కమిషనరేట్‌కు మార్చిలోనే ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు వేయి హెక్టార్లలో చీనీ, మామిడి ఎండినట్లు నివేదికలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలాగే ఏడీలు, హెచ్‌వోల ద్వారా ఎండుతున్న పంటల విస్తీర్ణం వివరాలను సేకరిస్తున్నాం. వాటిని కూడా రేపోమాపో ప్రభుత్వానికి పంపుతాం. కనీసం ఆరు వేల హెక్టార్లలో చీనీతోటలకు, రెండు వేల హెక్టార్లలో మామిడి తోటలకు ర„ý కతడులు ఇవ్వడానికి అనుమతులు కోరాం.