హిందూపురం రూరల్: వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. సోమవారం కిరికెరలోని కేంద్ర పట్టు పరిశోధన కేంద్రంలో నల్లచెరువు, పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర ఉద్యానవన శాఖ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఏడాదికి 50 వేల హెక్టార్ల ఉద్యానవన పంట సాగును లక్ష్యంగా నిర్దేశించామని ఇప్పటి వరకు 22 వేల హెక్టార్లల్లో పంట సాగు పూర్తి చేశామన్నారు. అమరాపురం, రొళ్ల మండలాల్లో 100 హెక్టార్లల్లో వక్క తోట పంటలు అంతర్ పంటగా మిర్యాల సాగు చేయడానికి ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డివిజన్ అధికారులు సుదర్శన్, రామ్ ప్రసాద్, జయకుమార్, ధరణి, అనిత, నరేష్, ఎంపీఈఓలు, ఫీల్డ్ కన్స్‌ల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.